కాకతీయుల వారసుడి చేతులమీదుగా కాకతీయ ఉత్సవాలు

కాకతీయులకు ఏడు సెంటిమెంట్ అని..జులై 7 నుంచి ఏడు రోజుల పాటు కాకతీయుల వైభవ సప్తాహం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. చరిత్రకారుల రీసెర్చ్ లో కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్ ఛత్తీస్ఘడ్ లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని..ఆయన చేతుల మీదుగా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. కాకతీయుల గొప్ప చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గురువారం ఉదయం 8.30 గంటలకు భద్రకాళి అమ్మవారి ఆలయవ వద్ద కాకతీయుల వారసుడికి స్వాగతం పలుకుతామని వినయ్ భాస్కర్ తెలిపారు. మొదట ఆయన రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి..వరంగల్ పోర్ట్ కు సందర్శిస్తారని చెప్పారు. అనంతరం హన్మకొండలోని ఓరుగల్లు రాజధానిని సందర్శించడంతోపాటు హైదరాబాద్ లోని స్టేట్ మ్యూజియంలో మంత్రి కేటీఆర్ తో కలిసి 777 చిత్రాల ప్రదర్శనను ప్రారంభిస్తారని వినయ్ భాస్కర్ చెప్పారు. 8 నుంచి 12 వరకు ప్రతిరోజు హన్మకొండలోని వేణుమాధవ్ ఆడిటోరియంలో నాటకోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక 13న రామప్ప ఆలయం వద్ద ముగింపు ఉత్సవాలకు మంత్రి కేటిఆర్ హాజరవుతారని వెల్లడించారు.