- భూ సేకరణకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు
- వచ్చే వారం టెండర్లు పిలిచే అవకాశం
- లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు
- భూత్పూరు జలాశయం నుంచే ఎత్తిపోతలు
- పది చెరువుల సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికలు అయిపోవడం, కోడ్ కూడా ముగియడంతో పాలనపై దృష్టి పెంచిన సర్కారు.. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం తలపెట్టిన నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో భూ సేకరణ సమస్యలు రాకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నది. రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో నిర్మించనున్న ఈ లిఫ్ట్ స్కీమ్‌కు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా బుధవారం టెండర్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను బట్టి సర్కారు టెండర్ల ప్రక్రియను ఖరారు చేయనున్నట్టు సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే వారంలోనే టెండర్లను పిలిచే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ లిఫ్ట్ స్కీమ్‌కు శంకుస్థాపన చేశారు. మొత్తం 10 చెరువులకు నీటిని మళ్లించాల్సి ఉండగా వాటి సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీలకి పెంచాలని మొదట్లో నిర్ణయించారు. తాజాగా దాన్ని 4.022 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా పనులు చేపట్టనున్నారు.
ఇప్పటికే అధ్యయనం పూర్తి
లిఫ్ట్ స్కీమ్‌కు నీటిని తీసుకునే భీమా ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం దగ్గరి నుంచి చివరి పాయింట్ వరకు ఇప్పటికే సర్వే పూర్తయింది. తాజా ప్రతిపాదనల ప్రకారం రెండు దశల్లో పనులు చేపట్టేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది. భూత్పూరు జలాశయం నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా భూత్పూరు జలాశయం నుంచి ఊట్కూరు చెరువుకు నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి జయమ్మ చెరువు.. అక్కడి నుంచి కనుకుర్తి చెరువు వరకు నీళ్లను లిఫ్ట్ చేస్తారు. నీటిని లిఫ్టింగ్ చేయడంతో పాటు ఊట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశ పనులకు సుమారు రూ.2,945 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నది. ఇక, రెండో దశలో భాగంగా ఏడు చెరువుల సామర్థ్యాన్ని పెంచేందుకు సర్కారు నిర్ణయించింది. జాజాపూర్, దౌల్తాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మిపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల సామర్థ్యాన్ని పెంచనున్నది. గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపడ్తుంది. ఈ రెండో దశ పనులకు రూ.1,404.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నది.
ఎక్కడ ఎన్ని ఎకరాలకు
లక్ష ఎకరాలకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా.. మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గీ, దౌల్తాబాద్, బొమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించింది. ఇటు 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందించనున్నది. అందుకు అవసరమైన అప్రోచ్ చానళ్లు, టన్నెళ్లు, పంప్ హౌజ్‌లు, డెలివరీ మెయిన్స్, సిస్టర్న్స్ నిర్మించనున్నది.
సొరంగాలకు బదులు ప్రెషర్ మెయిన్స్
భూసేకరణ సమస్యలు రాకుండా మూడు దశల్లోనే పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే సొరంగాలకు బదులు ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని డిసైడ్ అయింది. సొరంగాల తవ్వకానికి ఎక్కువ భూమి కావాల్సి వస్తుంది. అంతేగాకుండా, అవసరమైన జియోలాజికల్ సర్వేలకు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్ల తొలగింపునకు ఎక్కువ టైమ్ పడుతుంది. 38 కిలో మీటర్ల పొడవునా సొరంగాలు తవ్వాలంటే ఐదేండ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చు, భూ సేకరణ సమస్యలు రాకుండా ఉండడం, వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనతోనే ప్రెషర్ మెయిన్స్‌తో ప్రాజెక్టును నిర్మిచాలని భావిస్తున్నది. ఉద్దండపూర్ రిజర్వాయర్ (సముద్ర మట్టానికి 269 అడుగులు) నుంచి నీటిని లిఫ్ట్ చేయడం కంటే.. భూత్పూర్ రిజర్వాయర్ (350 అడుగులు) నుంచి ఎత్తిపోయడం ఈజీ కావడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది.
భూ సేకరణ సమస్య రాకుండా..
ఉమ్మడి రాష్ట్రంలో సర్వేలు చేసి రూపొందించిన డీపీఆర్‌ల ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు రూ.3,117 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారు. అయితే, వాటిని పరిశీలించిన కాంగ్రెస్ సర్కారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న రూ.2,945.50 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. నీటిని తీసుకునే ప్లేస్ మార్చాలని నిర్ణయించింది. సంగంబండ నుంచి కాకుండా భూత్పూరు జలాశయం నుంచి తీసుకోవాలని డిసైడ్ అయింది. భూసేకరణ సమస్యలు రాకుండా ఉండేందుకు సర్కారు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా పలు మార్పులను చేసి అంచనాలనూ సవరించింది. తొలుత నాలుగు దశల్లో కృష్ణా జలాలను ఎత్తిపోసి, ఏడు టీఎంసీలను లక్ష ఎకరాలకు ఇవ్వాలని అనుకున్నది.