![రాజకీయాలకు అతీతంగా ఎస్సీలకు మంచి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్](https://static.v6velugu.com/uploads/2025/02/govts-intention-is-to-do-good-for-scs-beyond-politics-cm-revanth_nwhxAosmM0.jpg)
హైదరాబాద్: రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా.. మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాదిగ ఉపకులాల ప్రతినిధులు మంగళవారం (ఫిబ్రవరి 11) సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్టబద్దంగా ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు.
అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు. సాధ్యమైనంత తొందరగా సదరు నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్లో, ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా అభినందించారు.
Also Read :- ప్రామిస్ డే రోజున సీఎంకి హరీష్ రావు కీలక సూచన
వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని పేర్కొన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంద కృష్ణ మాదిగకు సూచించారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.