
- వెంటనే కేఫ్‌ను గీత కార్పొరేషన్‌కు అప్పజెప్పాలి
- గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్
ట్యాంక్ బండ్, వెలుగు: ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు టూరిజం శాఖ కుట్రలు పన్నుతోందని గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వెంటనే నీరా కేఫ్ తో పాటు భవనాన్ని గీత కార్పొరేషన్‌కు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ భవనంలో తెలంగాణ గౌడ సంఘాలు సమావేశమయ్యాయి.
విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నీరా కేఫ్ విషయంలో ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తే.. టూరిజం శాఖ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోందన్నారు. మంత్రి ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టూరిజం శాఖ బినామీ శంకర్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని భవనాన్ని అప్పజెబుతున్నారని ఆరోపించారు.
నీరా కేఫ్ లో గౌడ కులస్తుల ప్రతిమలు తీసివేయడంతోపాటు చెట్లను నరికి వేసిన శంకర్ రెడ్డి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన లావాదేవీల వివరాలు బయటపెట్టి, టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డిని, ఇతర సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో 17న చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు.
అనంతరం సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్లో శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణ గౌడ సంఘాల ప్రతినిధులు బండి సాయన్న గౌడ్, చీకటి ప్రభాకర్ గౌడ్, మధుసూదన్ గౌడ్, వంగ సదానందం గౌడ్, మల్లేశం గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దేశం మహేష్ గౌడ్, భవాని గౌడ్, అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.