- మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
కోహెడ (హుస్నాబాద్), వెలుగు : గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతిఊరికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వెనుకబడిన తండాలకు రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరుస్తామన్నారు. నిర్వాసితుల సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో సీలింగ్ ఇష్యూ ఉందని, రెవెన్యూ మేళా నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయ్యారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.