జీతాలియ్యకుంటే బతికేదెట్లా?..8 నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు రావట్లే

జీతాలియ్యకుంటే బతికేదెట్లా?..8 నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు రావట్లే
  • వనపర్తి జిల్లాలో రూ.1.02 కోట్ల బకాయిలు

వనపర్తి, వెలుగు : గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు నెలల తరబడి వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు. పండుగలు, పబ్బాలకు కుటుంబమంతా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండడంతో బకాయి వేతనాలు అందుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. వనపర్తి జిల్లాలో 265 గ్రామపంచాయతీలు ఉండగా, 1,084 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి రూ.1.02 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది.

పాలకవర్గం లేకనే!

గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారులు పాలన మొదలైంది.  ఆయా శాఖల అధికారులు తమ డ్యూటీతో పాటు అదనంగా గ్రామపంచాయతీ డ్యూటీని చేయాల్సి వస్తోంది. దీంతో కొన్ని నెలలుగా పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి. నల్లా, ఇంటి పన్నులు వసూలైతేనే కార్మికులకు వేతనాలతో పాటు గ్రామాల్లో ఇతర అభివృద్ధి పనులు చేపడతారు. అరకొరగా వసూలైన డబ్బులతో ట్రాక్టర్ల తాలూకు ఈఎంఐలు, డీజీల్​ బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.  

ఇంకా ఎన్నాళ్లు అప్పులు చేయాలి..

ఇప్పటికే అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇక అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. నెలవారీ కిరాణా సామాను, పిల్లల చదువులు, పాల బిల్లులు ఇలా చిల్లర ఖర్చులకు అప్పులు చేశాం. 8 నెలలు జీతాలు రాకపోతే ఎలా బతకాలి. ఆఫీసర్లు వెంటనే వేతనాలు ఇప్పించాలి. -  హన్మంతునాయక్​, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు

రెగ్యులర్​గా జీతాలు ఇవ్వాలి..

పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం రావడం లేదు.  ఆందోళనలు, ధర్నాలు, సమ్మె చేశాం. కలెక్టర్, డీపీవోలు స్పందించి కార్మికులకు పెండింగ్​ వేతనాలు చెల్లించాలి. రెగ్యులర్ గా జీతాలు అందేలా చూడాలి.

– మండ్ల రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి

రేపుమాపంటూ తిప్పుతున్నారు..

వేతనాలు అడిగితే అధికారులు రేపుమాపు వస్తాయంటూ తిప్పుకుంటున్నారు. రోజంతా పనులు చేయించుకుంటున్న ఆఫీసర్లు, జీతం అడిగితే మాత్రం రేపు మాపంటూ తిప్పుకుంటున్నారు.

– పుష్ప, కార్మికురాలు, రుక్కన్నపల్ల