ప్రముఖ డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ ఫాం..గూగుల్ పే( GPay ) ద్వారా పేమెంట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. జూన్ 4 నుంచి అమెరికాలో GooglePay సర్వీస్ లను నిలిపివేయనుంది. అయితే ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ సేవలు బంద్ చేస్తారా? ఎందుకు ఈ సేవలు నిలిపివేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలు గూగుల్ పే యూజర్లలో బుర్రలో తిరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
గూగుల్ వాలెట్
ఇటీవల ఇండియాలో గూగుల్ వాలెట్ ను పరిచయం చేసింది గూగుల్ సంస్థ. తన వినియోగదారులకు సమగ్ర డిజిటల్ వ్యాలెట్ సొల్యూషన్ గా గూగుల్ వ్యాలెట్ ను అందిస్తోంది. వివిధ దేశాల్లో గూగుల్ వ్యాలెట్ ను విస్తరించేందుకు గూగుల్ పే ను మూసివేయాలని నిర్ణయించినట్లు గూగుల్ సంస్థ చెబుతోంది.
ఇతర దేశాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జూన్ 4న అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో Google Pay నిలిపివేయబడుతుంది. అయితే భారత్, సింగపూర్ లాంటి దేశాల్లో Google Pay ఎప్పటిలాగే పనిచేయనుంది. Google Pay, Google Wallet రెండూ స్వతంత్రంగా వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, ఇతర లావాదేవీలకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని గూగుల్ తెలిపింది.