- సిబ్బందికి బయోమెట్రిక్అటెండెన్స్, ఆఫీసులో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం
నిర్మల్, వెలుగు: కొంతకాలంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో శానిటేషన్ విభాగంలో జరుగుతున్న అవకతవకలకు చెక్‌పెట్టేందుకు కార్యాచరణ రెడీ అయింది. సిబ్బందికి బయోమెట్రిక్అటెండెన్స్, సీసీ కెమెరాలు, చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు రెడీ అవుతున్నారు. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో శానిటేషన్, సిబ్బంది, చెత్త సేకరణ వాహనాల వ్యవహారంపై ఆరోపణలు వస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది డ్యూటీలకు రాకున్నా వచ్చినట్లు రికార్డులు సృష్టించడం, తక్కువ సిబ్బంది పనిచేస్తుండగా ఆ నంబర్ఎక్కువ చూపి వేతనాలు కాజేయడం, చెత్తసేకరణ వాహనాల మెయింటనెన్స్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్ గా స్పందించి సమూల మార్పులు చేపట్టాలని నిర్ణయించారు.
రెండుసార్లు బయోమెట్రిక్ అటెండెన్స్
శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్‌పై ఫిర్యాదులు వస్తుంన్నందున కలెక్టర్ దృష్టి సారించారు. దీనిలో భాగంగా సిబ్బంది హాజరును రెండుసార్లు బయోమెట్రిక్ విధానంలో రికార్డ్ చేయనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి కార్మికుడు బయోమెట్రిక్ లో తన హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మున్సిపాలిటీ ఆఫీసుల్లోనూ సిబ్బంది సక్రమంగా డ్యూటీలు చేసేందుకు విభాగాల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని నేరుగా కలెక్టరేట్ కు అనుసంధానం చేయనున్నారు. దీంతో కలెక్టర్ ఏ టైంలోనైనా ఆధారంగా మున్సిపాలిటీ ఆఫీసులలో జరుగుతున్న యాక్టివిటీస్‌ను పరిశీలించే అవకాశం ఏర్పడనుంది. మరోవైపు చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్అమర్చనున్నారు. దీంతో ఆ వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఎక్కడ చెత్త సేకరిస్తున్నాయి.. అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలిసిపోనున్నాయి.
80 వాహనాలకు జీపీఎస్
నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో మొత్తం 80 చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్పరికరాలను అమర్చనున్నారు. నిర్మల్ లో 41, బైంసాలో 29, ఖానాపూర్ లో 10 చెత్త సేకరణ వాహనాలతోపాటు జేసీబీలు ఉన్నాయి. వీటన్నింటికీ జీపీఎస్ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 242 మంది, బైంసాలో 91 మంది, ఖానాపూర్ లో 35 మంది శానిటేషన్సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయనున్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్‌కు ఏర్పాట్లు
కలెక్టర్ ఆదేశాల మేరకు శానిటేషన్సిబ్బంది కోసం బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నాం. నిర్మల్ తో పాటు బైంసా మున్సిపాలిటీలో కూడా ఈ విధానాన్ని అమలుచేస్తాం. చెత్త సేకరణ వాహనాలన్నింటికీ జీపీఎస్పరికరాలను అమర్చనున్నాం. మున్సిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఇక నుండి పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవు.
–సంపత్ కుమార్, కమిషనర్, నిర్మల్ మున్సిపాలిటీ