నిజాంపేట, వెలుగు: వృద్ధురాలైన తల్లి సంరక్షణ చూసుకోవాల్సిన కొడుకు బయటకు వెళ్లగొట్టి అమానవీయం చూపాడు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన వృద్ధురాలు కుంట సత్తవ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వీరికి పెండ్లిలు అయ్యాయి. ఆమె చిన్న కొడుకు గుండెపోటుతో ఏడాదిన్నర కింద చనిపోయాడు. సత్తవ్వ పేరిట మూడెకరాల భూమి ఉండగా.. రెండేండ్ల కింద పెద్ద కొడుకు రమేశ్ఒక్కడే అమ్ముకున్నాడు. అతను మెదక్ టౌన్లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. తల్లిని తన వద్ద ఉంచుకున్నాడు. మూడు రోజుల కింద సత్తవ్వ వద్ద ఉన్న15 తులాల బంగారాన్ని రమేశ్ లాక్కొని బయటకు గెంటేశారు.
సత్తవ్వ గురువారం సొంతూరు నిజాంపేటకు వచ్చి.. నడిచే ఓపిక లేక, ఇంటికి వెళ్లలేక రోడ్డు పక్కన కూర్చుంది. గ్రామస్తులు చూసి అడగగా.. రమేశ్ రోజూ తాగొచ్చి పింఛన్ డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండని, ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించిండని వాపోయింది. తన వద్ద ఉన్న బంగారం లాక్కొని ఇంట్లోంచి వెళ్లగొట్టాడని వృద్ధురాలు రోదిస్తూ తెలిపింది. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితురాలు సత్తవ్వ వేడుకుంటోంది.