అన్యాయం చేస్తున్నాడని బాధితుల ఆవేదన
పీఎస్‌లో పెట్టి నిర్బంధించారని ఆరోపణ
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్బస్డిపో ఏర్పాటు కోసం తమ భూమిని గుంజుకోవడమే కాకుండా తమను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధం చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్‌కు చెందిన బాధితులు బోగె లక్ష్మి, పెద్ద రాజేశ్వరి, చిన్న రాజేశ్వరి కథనం ప్రకారం... పట్టణంలోని గెర్రె కాలనీ శివారు 869/28/1లో తమ మామ అయిన బోగె మల్లయ్య పేరిట మూడెకరాల భూమి ఉందన్నారు. 50 ఏండ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు.
మల్లయ్య చనిపోయిన తర్వాత ఆయన ముగ్గురు కొడుకులు కూడా మరణించడంతో వారి భార్యలమైన తాము సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమిలో చెన్నూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌దేశ్‌పాండే ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు గతేడాది అక్టోబర్9న ఇంటి నెంబర్ కూడా ఇచ్చాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న తమ భూమిలో బస్‌డిపో ఏర్పాటు కోసం పరిశీలించారని, పెన్సింగ్పోల్స్తొలగిస్తే అడ్డుకున్నామన్నారు. అప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని, తమ భూమి వెనుకాల ఉందని చెప్పారన్నారు. ఈ భూమి బస్‌డిపోకు అప్పగిస్తే తమ భూమి చూపిస్తానని నమ్మబలికారన్నారు. తమకు ఆ రోజు వెనకాల ఉందని చెప్పిన భూమి ఇప్పుడు వేరేవాళ్లపై పేరిట ఉందన్నారు. తాము అక్కడికి వెళ్తే ఆ భూమి యజమానులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.
ఇప్పటివరకు తమకు భూమి చూపలేదని, తాము సాగు చేసుకుంటున్న భూమిలో ఆదివారం బస్ డిపో ఏర్పాటుకు ఎమ్మెల్యే బాల్క సుమన్భూమిపూజ చేశారన్నారు. తమ భూమిని దౌర్జనంగా ఎందుకు గుంజుకుంటున్నారని అడిగినందుకు పోలీసులతో అరెస్టు చేయించి స్టేషన్లో నిర్బంధించి భూమిపూజ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, తహసీల్దార్ శ్రీనివాస్‌దేశ్‌పాండే కలిసి తమను మోసం చేశారన్నారు. తమ మామ మల్లయ్య పేరిట ఉన్న మూడెకరాల భూమిని తమకు అప్పగించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.