ఛాతీపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు: అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్​

ఛాతీపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు: అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్​
  • తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు
  • సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకోవాలి: ఇందిరా జైసింగ్

న్యూఢిల్లీ: మహిళల ఛాతీపై చేయి వేయడం, పైజామా డ్రెస్ లాగడం వంటి వాటిని రేప్ అటెంప్ట్ లేదా రేప్ గా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ ప్రయత్నాన్ని లైంగిక దాడి చర్యగా పరిగణించవచ్చని అందులో పేర్కొంది. రేప్​ ఆరోపణల్లో అత్యాచార ప్రయత్నానికి సిద్ధమయ్యే దశ(ప్రిపరేషన్ స్టేజ్), వాస్తవంగా రేప్ చేసే ప్రయత్నం (యాక్చువల్​స్టేజ్) మధ్య తేడా ఉంటుందని తెలిపింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

2021లో ఉత్తరప్రదేశ్ ​రాష్ట్రం కాస్​గంజ్ లో తల్లి, తన 11 ఏండ్ల బాలికతో మరో గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే బైక్​పై అటుగా వెళ్తున్న ఆకాశ్, పవన్ అనే వ్యక్తులు అమ్మాయిని తాము దిగబెడుతామని చెప్పి ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక ఒక కల్వర్టు వద్ద బైక్​ ఆపి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అసభ్యంగా పట్టుకోవడం, బాలిక డ్రెస్​ లాగడం, తన పైజామా నాడాని తెంపేడయం వంటివి చేశారు. 

కల్వర్టులోకి లాక్కెళ్తుండగా బాలిక వేసిన కేకలు విని సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు వచ్చి బాధితురాలిని కాపాడారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన కేసు తుది విచారణను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా చేపట్టారు. 

ప్రిపరేషన్ స్టేజ్ దాటిపోతేనే..  

‘‘నిందితులు పవన్, ఆకాశ్​పై వచ్చిన ఆరోపణలు, కేసుకు సంబంధించిన వాస్తవాలు పరిశీలిస్తే వారి చర్యలను రేప్ అటెంప్ట్​గా పరిగణించరాదు. రేప్, రేప్ అటెంప్ట్ ఆరోపణలు నిరూపించాలంటే వారి చర్యలు ప్రిపరేషన్ స్టేజ్ ను దాటిపోయినట్టుగా నిర్ధారించాలి. ఒక నేరానికి పాల్పడటానికి సిద్ధమవడం, వాస్తవ ప్రయత్నం మధ్య తేడా గుర్తించాలి” అని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులిద్దరు రేప్​ చేయాలనుకున్నారని నిర్ధారించడానికి రికార్డుల్లో ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. 

అయితే నిందితులు బాలిక దుస్తులు తొలగించేందుకు యత్నించినందున వారిపై ఐపీసీ సెక్షన్ 354 (బి) పోక్సో చట్టం కింద విచారించాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ తీర్పుపై ‘ఎక్స్’లో పోస్ట్​చేశారు. అలహాబాద్​ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో యాక్షన్ అవసరమన్నారు.