ఇంటర్నల్ మార్కులతో గ్రేడింగ్ ఇలా..!
హైదరాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్‌లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించడంతో అందరి ఫోకస్ వాటిపై పడింది. అయితే గ్రేడింగ్ విధివిధానాలపై మంగళవారం ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్నది. రాష్ట్రంలో 5,34,903 మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 5,09,079 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా.. 25,824 మంది ప్రైవేటు స్టూడెంట్స్.
ఇప్పటికే ఇంటర్నల్ మార్కుల అప్లోడ్
టెన్త్‌లో ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు ఉండగా, దీంట్లో రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) ద్వారా మరో 20 మార్కులు (ఇంటర్నల్ మార్కులు) కేటాయిస్తారు. ఎఫ్ఏ పరీక్షలను అకడమిక్ ఇయర్లో ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్‌కు సంబంధించిన ఈ ఇంటర్నల్ మార్కుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్‌లైన్‌ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా ఈసారి స్టూడెంట్స్‌కు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రైవేటు స్టూడెంట్స్‌కు సంబంధించి గతంలో ఎఫ్ఏ పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి, ఆ మార్కులకు పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే, వారం పదిరోజుల్లో గ్రేడింగ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కేవలం స్కూళ్లలో ఇంటర్నల్‌గా జరిగిన పరీక్షలకు ఆబ్సెంట్ అయిన వారే ఫెయిల్ అయ్యే చాన్స్ ఉంది.
గ్రేడింగ్స్, పాయింట్లు ఇట్లేస్తరు..!
స్టూడెంట్స్‌కు వచ్చిన మార్కుల ఆధారంగా సీసీఈ విధానంలో 8 గ్రేడ్స్ ఇస్తారు. దీంట్లో 91 మార్కుల నుంచి100 మార్కుల వరకు వస్తే ఆ స్టూడెంట్‌కు ఏ1 గ్రేడ్‌గా గుర్తించి పది గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. జీరో నుంచి 34 మార్కుల వరకొస్తే డీ 2 గ్రేడ్ ఇచ్చి.. మూడు పాయింట్లు ఇస్తారు. డీ 2 గ్రేడ్ అంటే ఫెయిల్‌గా పరిగణిస్తారు. అయితే ఇంటర్నల్మార్కుల్లో ప్రైవేటు స్కూల్స్ దాదాపు 20కి 20 మార్కులు వేసుకుంటారని, సర్కారు స్కూల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారనే విమర్శ మొదటి నుంచి ఉంది.
పూర్తి మార్కులు వేసేది ఇట్ల..!
ఎఫ్ఏ 1, 2, 3, 4.. ఇలా నాలుగు ఎఫ్ఏ ఎగ్జామ్స్‌లో ప్రతి సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున మొత్తంగా 80 మార్కులు ఉంటాయి. ఈ మొత్తంలో యావరేజ్ మార్కులను తీసుకొని.. దానికి ఐదురెట్లు పెంచుతారు. అలా పెంచినదాన్ని పూర్తిస్థాయి మార్కులుగా పరిగణించనున్నారు. దీని ఆధారంగా గ్రేడ్స్, పాయింట్లు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టుకూ ఇదే విధానాన్ని అమలుచేస్తారు. ఉదాహరణకు ఒక సబ్జెక్టుకు సంబంధించి నాలుగు ఎఫ్ఏ ఎగ్జామ్స్‌లో యావరేజ్‌గా 10 మార్కులు వస్తే.. పూర్తి స్థాయి మార్కులు 50 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు. అదే నాలుగు ఎఫ్ఏల్లో యావరేజ్‌గా 20 మార్కులు వస్తే.. పూర్థి స్థాయి మార్కులు 100 వచ్చినట్లుగా పేర్కొంటారు.
మార్కులు గ్రేడ్ గ్రేడ్ పాయింట్లు
91 నుంచి 100 ఏ1 10
81-90 ఏ2 9
71-80 బీ1 8
61-70 బీ2 7
51-60 సీ1 6
41-50 సీ2 5
35-40 డీ1 4
0-34 డీ2 3