స్పీడ్ పెంచిన క్యాండిడేట్స్ ...సోషల్ మీడియా, ఔట్ డోర్ మీడియా జోరుగా ప్రచారం

స్పీడ్ పెంచిన క్యాండిడేట్స్ ...సోషల్ మీడియా, ఔట్ డోర్ మీడియా జోరుగా ప్రచారం
  • గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం
  • నేరుగా ఓటర్లను కలవలేక సమావేశాలు ఏర్పాటు  
  • ఐదురోజులే మిగిలి ఉండగా క్యాడర్ పైనే వేసిన భారం 
  • సోషల్ మీడియా, ఔట్ డోర్ మీడియా జోరుగా ప్రచారం 
  • అభ్యర్థుల వాయిస్ కాల్స్ తో పాటు మెసేజ్ లతో రీచ్ 

కరీంనగర్, వెలుగు:  గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే మిగిలింది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం 42 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉంది. ఇప్పటివరకు అభ్యర్థులు కొన్ని సెగ్మెంట్లకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

దీంతో ఓటర్లను నేరుగా కలవడం సాధ్యం కాకపోవడంతో జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోనే గ్రాడ్యుయేట్లను సమీకరించి మీటింగ్స్ నిర్వహించి అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు మీడియా, సోషల్, ఔట్ డోర్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 

ఫోన్ కాల్స్, ఎస్ఎంస్ ల హోరు.. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ప్రధానంగా పోటీ పడుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ గా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ -టీపీటీఎఫ్ అభ్యర్థివై.అశోక్ కుమార్, సీపీఎస్ అభ్యర్థి ఇన్నారెడ్డి బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గత ఐదు నెలలుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను రెండుసార్లు చుట్టేశారు. 

బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్లతో నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం షురూ చేశారు. ఆలస్యంగా బరిలోకి దిగినా.. బీజేపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లకు ఆటోమెటెడ్ ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. 

అభ్యర్థుల వాయిస్ ను రికార్డు చేసిన కాల్స్ రోజుకు 15, 20 సార్లు  వెళ్తుండగా.. భరించలేక  కొందరు ఓటర్లు బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పేర్లతో ఎస్ఎంఎస్ లు రోజుకు నాలుగైదు సార్లు వస్తున్నాయి. వాట్స ప్ గ్రూపుల్లోనూ ఇవే లింకులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కొందరు అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. 

 పార్లమెంట్ సెగ్మెంట్ కో మంత్రికి ఇన్ చార్జ్ బాధ్యతలు

కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గానికో మంత్రిని ఇన్ చార్జ్ గా నియమించింది. పెద్దపల్లి ఇన్ చార్జ్ గా మంత్రి శ్రీధర్ బాబు, కో ఇన్ చార్జ్ గా ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఇన్ చార్జ్ గా మంత్రి దామోదర రాజనర్సింహ, కో ఇన్ చార్జ్ ఎంపీ సురేష్ షెట్కార్, కరీంనగర్ ఇన్ చార్జ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ కు మంత్రి సీతక్క, నిజామాబాద్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు, మెదక్ మంత్రి కొండా సురేఖను నియమించింది. అలాగే  42 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇన్ చార్జ్ గా బాధ్యతలు ఇచ్చింది. వీరితోపాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల  చైర్మన్లను కో – ఆర్డినేటర్లుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 

క్యాడర్ పైనే భారమంతా.. 

పోల్ మేనేజ్ మెంట్ లో భాగంగా లీడర్లు, క్యాడర్ పైనే భారం వేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ లో ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ లో ఎంపీ గోడం నగేశ్, నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ భుజానికెత్తుకున్నారు. మండల కేంద్రాల్లోని పోలింగ్ బూత్ వరకు గ్రాడ్యుయేట్ ఓటరు వచ్చేలా చూసేలా ఆయా పార్టీల మండల అధ్యక్షులకు టార్గెట్లు పెడుతున్నారు.