కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌‌‌‌‌‌‌‌

 కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్/జగిత్యాల/రాజన్నసిరిసిల్ల/పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల కన్నా టీచర్లే ఎక్కువ శాతం ఓటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 210  గ్రాడ్యుయేట్, 65 టీచర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిగురుమామిడిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. 

ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు పోలింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లను సందర్శించారు. కరీంనగర్ ముక్రంపురలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో తన గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఓటేశారు. 

కరీంనగర్ మంకమ్మ తోట ధన్ ఘర్ వాడి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బోయినిపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ దంపతులు, జగిత్యాల పురాణిపేట ప్రభుత్వ పాఠశాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, వాణినికేతన్ డిగ్రీ కాలేజీలోని పోలింగ్ స్టేషన్ లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, గంగాధర మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దంపతులు, ముక్రంపుర పాఠశాలలో కాంగ్రెస్ కరీంనగర్  పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తమ గ్రాడ్యుయేట్ ఓటును వినియోగించుకున్నారు. 

చిగురుమామిడిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలింగ్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ లీడర్, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ కు చెందిన వాహనంలో డబ్బులున్నాయని ఆరోపిస్తూ కారు డిక్కీ, డోర్లను ధ్వంసం చేసి బీజేపీ నాయకులు హంగామా చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు, గతంలో నిర్వహించిన జాబ్ మేళా కరపత్రాలు చూపుతూ ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.