రేపు ( ఫిబ్రవరి 27 ) ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి

రేపు ( ఫిబ్రవరి 27 ) ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి

ఫిబ్రవరి 27న తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. 7 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇలా త్రిపాఠి. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పాత 3 జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ 12 జిల్లాల అధికారుల కోఆర్డినేషన్ బాగుందని.. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తామని అన్నారు. 

సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని అన్నారు త్రిపాఠి.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా.. 200 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ క్యామ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని..  ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని అన్నారు. దాదాపు 1100 మందిని ఎన్నికల నిర్వహణ కోసం కేవలం పోలింగ్‌ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశామని అన్నారు.విద్యావంతులైన ఉపాధ్యాయులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు త్రిపాఠి. 

ఇలా త్రిపాఠితో పాటు పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడూతూ.. దాదాపు వేయి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లేటప్పటి నుంచి తిరిగి రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చే వరకు పోలీసుల భద్రత ఉంటుందని అన్నారు.వాహనం వెంట సెక్యూరిటీ కూడా నల్లగొండ జిల్లా పోలీసులే ఉంటారని.. బయటి జిల్లాల నుంచి బ్యాలెట్ పేపర్లను తరలించేటప్పుడు జిపిఎస్ సిస్టం పరిశీలిస్తూ సెక్యూరిటీ ద్వారా తీసుకొస్తామని తెలిపారు. 

పోలింగ్‌ అనంతరం ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన అన్ని బ్యాలెట్‌ బాక్సులను నల్లగొండలోని రిసెప్షన్‌ సెంటర్‌కు తీసుకొస్తామని.. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో పొలిటికల్‌ ప్రజాప్రతినిధుల సమక్షంలో భద్రపరుస్తామని అన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని అన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్.