
- ఉమ్మడి జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 69071, టీచర్లు 5693 మంది
- 160 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
- పకడ్బందీగా 144 సెక్షన్ అమలు
- సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
నిర్మల్/నస్పూర్/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు: మెదక్–నిజామాబాద్–-ఆదిలాబాద్–-కరీంనగర్ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందించారు.
జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 17,141 మంది ఉన్నారు. వీరిలో 11,497 మంది పురుషులు, 5,644 మంది మహిళలున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 1966 మంది కాగా.. 1282 మంది పురుషులు, 684 మంది మహిళా ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసుల నిఘా కట్టుదిట్టం చేశారు. 224 మంది పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లాలో 60 మంది ప్రిసైడింగ్ అధికారులు, 181 మంది పోలింగ్ అధికారులు, 25 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో పట్టభద్రులు 30921 మంది ఉండగా వారిలో 19,041 మంది పురుషులు, 11,880 మంది మహిళలున్నారు. ఉపాధ్యాయులు 1664 ఉండగా వారిలో 999 మంది పురుషులు, 665 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 18 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వాటిలో 8 కామన్ కేంద్రాలున్నాయి. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికుమార్ దీపక్ ఓ ప్రకటనలో కోరారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ రాజర్షి షా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 14935 ఉండగా, టీచర్ఓటర్లు 1593 మంది ఉన్నారు. మొత్తం 264 మంది సిబ్బంది ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ తదితరులున్నారు.
250 మంది విధుల్లో..
ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలో మొత్తం 6,607 మంది పట్టభద్ర ఓటర్లుండగా వారిలో 6,137 మంది పట్టబద్రులు, 470 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఎన్నికల విధులు కోసం 19 మంది పీవోలు, 87 ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు 17మంది ఉన్నారు. మొత్తం 250 మంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.