నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్లు ముగిశాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు 4 వేల208 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం మూడు రౌండ్లు ముగిసేసరికి తీన్మార్ మల్లన్నకు లక్షా 62 వేల 34 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 87 వేల 356 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి ప్రేమేందర్ రెడ్డికి 34 వేల 516 ఓట్లు వచ్చాయి. మొత్తం మూడు రౌండ్లలో తీన్మార్ మల్లన్న 18 వేల 8 వందల80 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు మూడు రౌండ్ లలో 2 లక్ష 88 వేల ఓట్ల లెక్కించారు. నాలుగో రౌండ్ లో 48 వేల13 ఓట్లను లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. నాలుగో రౌండ్ కూడా పూర్తి అయిన తర్వాత , చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
కానీ.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా గెలుపు కోటాకీ సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించనున్నారు అధికారులు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో విజేత తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.