పాత దోస్తులే.. ఎమ్మెల్సీ ప్రత్యర్థులు

పాత దోస్తులే.. ఎమ్మెల్సీ ప్రత్యర్థులు
  • అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్న మల్లన్న, రాకేశ్‍రెడ్డి, ప్రేమేందర్‍రెడ్డి
  • ఎలక్షన్‌‌కు ముందు పార్టీ మారిన మల్లన్న, రాకేశ్‍రెడ్డి
  • కమలం పార్టీ నుంచి మరోసారి బరిలోకి దిగిన గుజ్జుల
  • కాంగ్రెస్‌‌ నుంచి మల్లన్న, బీఆర్‍ఎస్‍ తరఫున రాకేశ్‍రెడ్డి పోటీ

వరంగల్‍, వెలుగు: కొన్ని రోజుల కిందటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన ముగ్గురు ఇప్పుడు గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో . వరంగల్‍, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్న తీన్మార్‌‌ మల్లన్న, ఏనుగుల రాకేశ్‌‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీలో కలిసి పనిచేశారు. తర్వాత ప్రేమేందర్‌‌రెడ్డి తప్ప మిగతా ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో జాయిన్‌‌ అయి గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ టికెట్‌‌ దక్కించుకొని గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌‌లోకి తీన్మార్‌‌ మల్లన్న

2021లో జరిగిన వరంగల్‍, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్‌‌ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ పల్లా రాజేశ్వర్‍రెడ్డి గెలిచినప్పటికీ ఇండిపెండెంట్‌‌గా బరిలో నిలిచిన తీన్మార్‌‌ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అదే సంవత్సరం డిసెంబర్‌‌ 7 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍, ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ నేతృత్వంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్‌‌ సమక్షంలో మల్లన్న బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అదే టైంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి ఉండగా, ఏనుగుల రాకేశ్‌‌రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 

ఈ ముగ్గురు ఏ చిన్న అవకాశం దొరికినా గులాబీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్‍ 8న మల్లన్న అనూహ్యంగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌‌చార్జి మానిక్‌‌రావ్‌‌ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌‌ కుమార్‌‌గౌడ్‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌‌ క్యాండిడేట్ల తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తర్వాత గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ 
రావడంతో మిగతా పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్‌‌ పార్టీ తమ క్యాండిడేట్‌‌గా మల్లన్న పేరును కన్ఫర్మ్‌‌ చేసింది.

బీజేపీ అసెంబ్లీ టికెట్‌‌ దక్కకపోవడంతో ‘కారు’ ఎక్కిన రాకేశ్‌‌రెడ్డి

గ్రేటర్‌‌ వరంగల్‌‌లోని ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాకేశ్‌‌రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్‌‌ పిలానీలో ఫైనాన్స్‌‌ అండ్‌‌ మేనేజ్‍మెంట్‌‌ స్టడీస్‌‌లో మాస్టర్స్‌‌ పూర్తి చేశారు. 2013లో ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన రాకేశ్‌‌రెడ్డి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆపై రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌‌ పశ్చిమ  నియోజకవర్గ టిక్కెట్‌‌ ఆశించినప్పటికీ బీజేపీ కేటాయించలేదు. 

దీనికి తోడు పార్టీలో అవమానాలు తట్టుకోలేనంటూ కమలం పార్టీని వీడి గులాబీ పార్టీలో చేరారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ హైకమాండ్‌‌ ఆయనకు గ్రాడ్యుయేట్‌‌ టికెట్‌‌ కేటాయించింది. ఇక బీజేపీ తరఫున బరిలో దిగిన గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలోనూ ఇదే గ్రాడ్యుయేట్‍ స్థానంలో కమలం  పార్టీ తరఫున పోటీ చేసిన అనుభవం ఉంది. దీంతో పార్టీ హైకమాండ్‌‌ మరోసారి ప్రేమేందర్‍రెడ్డి పేరునే ఫైనల్‌‌ చేసింది. నిన్నమొన్నటివరకు ఒకే  పార్టీలో కలిసి పనిచేసిన లీడర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఢీ అంటే ఢీ అంటున్నారు. 

ప్రధాన పార్టీల మధ్యే పోటీ

వరంగల్‌‌, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు ఇండిపెండెంట్లను మినహాయిస్తే పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యే నెలకొంది. ఇందులో తీన్మార్‌‌ మల్లన్న, గుజ్జుల ప్రేమేందర్‌‌రెడ్డికి గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది. కానీ రాకేశ్‌‌ రెడ్డి మాత్రం మొదటి సారి బరిలోకి దిగారు. 

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్‍ ఓటర్లు ఉండగా, ఇందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794  మంది మహిళలు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‍ జరగనుంది. దీంతో ముగ్గురు పాత దోస్తులు ఎమ్మెల్సీ ప్రత్యర్థులుగా గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారంలో పరుగులు పెడుతున్నారు.