సూర్యాపేట, వెలుగు: పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) కోరారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మద్దతు కోరుతూ అక్కడే ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీలో నిలబడుతున్నానని చెప్పారు. వచ్చే నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మే 3న నల్గొండలో నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గ్రాడ్యుయేట్లను బీఆర్‌ఎస్ మోసం చేసింది: దామోదర్ రెడ్డి
గ్రాడ్యుయేట్లను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి క్యాండిడేట్లు దొరికే పరిస్థితి లేదని రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. మే 3న నిర్వహించే నామినేషన్ కార్యక్రమానికి సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.