
- ఇటు మంత్రి పొన్నం అటు ఎంపీ రఘునందన్
- గ్రామస్థాయి నుంచి క్యాడర్ సమాయత్తం
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వారే కావడంతో వారి గెలుపు ఆయా పార్టీలు, యూనియన్లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దాంతో వారిని గెలిపించుకునేందుకు పార్టీలు, యూనియన్ల ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు.
పోటాపోటీగా ప్రచారం
మెదక్ జిల్లాలో 11,953 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోటీ ఉంది. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కి మద్దతుగా ఎంపీ రఘునందన్ రావ్ ప్రచారం చేస్తున్నారు. ఆయన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టి పోలింగ్ పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా.. తమ కాండిడేట్ ఆధిక్యాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా దిశానిర్దేశం చేశారు.
మండలాల వారీగా మీటింగ్ లు పెట్టి ఓటర్లనుక్యాడర్ నేరుగా కలిసేలా ఉత్సాహపరుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్ నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్‌నేత మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ పరిధిలో మొజారిటీ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
నేరుగా ఓటర్లతో భేటీలు
సిద్దిపేట జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోది. ప్రధానపార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. కాంగ్రెస్, బీజెపీ అభ్యర్థుల పక్షాన గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి.
రెండు పార్టీలు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, సన్నాహాక సమావేశాలు నిర్వహించాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ నేతలు రంగంలోకి దిగారు. గ్రామాలు, పట్టణాల వారీగా ఓటరు జాబితాలను పట్టుకుని ఒక్కొక్కరినీ కలుస్తూ ఓటు అడుగుతున్నారు. బీజెపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఎంపీ రఘునందన్ రావు సన్నాహాక సమావేశాలు నిర్వహించగా, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తనకు పట్టున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. బీజెపీ క్యాడర్బూత్ స్థాయి నుంచి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
హుస్నాబాద్ లో మంత్రి ప్రత్యేక వ్యూహం
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి భారీ ఆధిక్యాన్ని సాధించేందుకు ప్రత్యేక వ్యూహ రచన చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 11,790 గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. ఇందులో మెజారిటీ ఓట్లు అభ్యర్థి నరేందర్ రెడ్డికి పోలయ్యేలా ఆయన పక్కాగా ప్లాన్ చేశారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి వారికి వ్యూహాన్ని వివరించారు. గ్రామాల వారీగా ప్రతి 50 ఓట్లకు ఒకరిని ఇన్‌చార్జిగా నియమించారు.
ఎన్నికలు పూర్తయ్యేదాకా వారు ఓటర్లతో నిరంతరం టచ్ ఉండి.. సర్కారు చేపడుతున్న పథకాలను వివరిస్తారు. నియోజవర్గంలోని 13 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్ జరిగేలా చూడడం కూడా వీరి బాధ్యతే. ఇన్చార్జిలను మండలస్థాయి నేతలు కోఆర్డినేట్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో లేరు. జిల్లానుంచి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఎటు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ పెద్దల నుంచి క్యాడర్‌కు ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలు రాలేదు.
50 మందికో ఇన్చార్జి
సంగారెడ్డి జిల్లాలోనూ ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు.. ఆపార్టీ యువమోర్చా, మహిళా మోర్చా నేతలు పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ అంజిరెడ్డి గెలిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటారని చెప్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం చేస్తున్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ప్రచారం చేస్తున్నారు.