గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై ఫోకస్..కొన్నిజిల్లాల్లో ఎన్నికల సందడి షురూ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై ఫోకస్..కొన్నిజిల్లాల్లో ఎన్నికల సందడి షురూ
  •     ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎన్నికల సందడి షురూ
  •     ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు 
  •     గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే వ్యూహాల్లో ఆశావహులు
  •     సోషల్ మీడియాలోనూ విస్తృతంగా క్యాంపెయిన్  

మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేపట్టింది. కాగా.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి.

సిటింగ్ సీటును తిరిగి దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ ముమ్మరం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో మరోసారి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.  బీజేపీ, బీఆర్ఎస్ కూడా దృష్టి సారించాయి.  దీంతో అన్ని పార్టీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. 

బీజేపీ జాబితా పెద్దదే..

గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించిన బీజేపీ సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి ఆశావహుల జాబితా కూడా పెద్దగానే ఉంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ సెల్ మాజీ చైర్మన్ పోల్సాని సుగుణాకర్ రావు, రాణిరుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి. మంచిర్యాల నియోజకవర్గ ఇన్ చార్జి వెరబెల్లి రఘునాథ్ రావు కూడా ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలవడంతో అదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 

వచ్చే నెల 6  వరకు ఓటరు నమోదు 

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గత నెల30న ప్రారంభమవగా..  వచ్చే నెల 6 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 30న ఓటర్ లిస్టు రిలీజ్ కానుంది. కలెక్టరేట్లలో ఓటరు రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో ఆన్ లైన్ లో ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఎలక్షన్ కార్డు ఎపిక్ నంబర్, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ , పాస్ ఫొటోతో ఫామ్ –18 సమర్పించాలి.

ఎమ్మెల్సీ ఓటరుగా 2021 నవంబర్ 11 లోపు డిగ్రీ పాసైనవారు అర్హులు. 2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోగా..  ఇప్పుడు గణనీయంగా పెరిగే చాన్స్ ఉంది. సుమారు 9 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆశావహులు ఓటరు నమోదు సెంటర్లను ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.  జిల్లాల్లోనూ  ఆశావహులు పర్యటిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

ఉనికి కోసం బీఆర్ఎస్ ఆరాటం

అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని, లోక్ సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తన ఉనికి చాటుకోవా లని ఆరాటపడుతోంది. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పేర్లు వినిపిస్తు న్నాయి. వీరితోపాటు మరికొందరు విద్యావేత్తలు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ జిల్లాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.