జనరల్ ఎలక్షన్ తో పోలిస్తే గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఓటింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చెల్లకుండా పోయే అవకాశం ఉంది. ఈసారి ఖమ్మం, నల్గొండ, వరంగల్ సీటుకు 52 మంది పోటీలో ఉండటంతో బ్యాలెట్ పేపర్ న్యూస్పేపర్ సైజ్లో ఉండనుంది. దీంతో మనం ఓటు వేయాలనుకున్న క్యాండిడేట్ పేరు ఎక్కడుందో వెతుక్కోవడం, ప్రాధాన్యతా క్రమంలో ఇద్దరు ముగ్గురికి నంబరింగ్ ఇవ్వడం, ఓటు వేశాక సరైన పద్ధతిలో మలవడం జాగ్రత్తగా చేయాలి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో సవివరంగా తెలుసుకుందాం..
తెలంగాణలో ఎన్నికల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగియగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. .. మే 27న ఉమ్మడి ఖమ్మం,- వరంగల్,- నల్గొండ జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మిగతా ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఓటర్ల ఎంపిక, పోలింగ్ విధానంతో పాటు ఓట్లు వేసే పద్ధతి కూడా విభిన్నంగా ఉంటుంది.
పోలింగ్ రోజున ఓటు వేయటం ఓటర్లకు పెద్ద టాస్క్... పోలింగ్ బూతులోకి వెళ్లగానే.. అధికారి మనకు ఓ బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. సొంతంగా తీసుకెళ్లిన పెన్నుతోనో, స్కెచ్‌తోనే వేస్తానంటే కుదరదు. అలా వేసినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇక.. పదుల సంఖ్యలో ఉండే అభ్యర్థుల పేర్లతో న్యూస్ పేపర్‌ను తలపించేలా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉండగా.. ఆ పేర్లకు ముందు ఓ బాక్స్ ముద్రించి ఉంటుంది. అయితే.. సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటెస్తే.. అది కాస్త చెల్లకుండా పోతుంది. కానీ.. ఇక్కడ మాత్రం వాటికి పూర్తి భిన్నం. ఒక ఓటరు ఎంత మందికైనా ఓటు వేసుకోవచ్చు.. కానీ అది ప్రాధాన్యత క్రమంలోనే వేయాల్సి ఉంటుంది.
ఓటింగ్ విధానం..
- ఓటు వేయడానికి ఓటరు స్లిప్, ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక ఓటరు గుర్తింపు పత్రం వెంట తీసుకువెళ్లాలి.
. - పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. వాటినే ఉపయోగించాలి.
- బ్యాలెట్ పత్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు, పార్టీ, పక్కన బాక్స్ ఉంటాయి.
- ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉంటాయి.
- పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో 1,2,3,4...ఇలా ప్రాధాన్య క్రమంలో కేటాయించాలి.
- ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి, ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకున్నా ఏం కాదు. ఒకటి, రెండు ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకున్నా పర్వాలేదు. ఎన్ని ప్రయారిటీ ఓట్లు వేసినా నంబరింగ్ మాత్రం వరుసగా ఉండాలి. ‘1’, ‘2’ ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకుండా ‘4’ ప్రయారిటీ ఇస్తే.. రెండో ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పక్కన పెడతారు.
- రోమన్ అంకెలు కానీ, ఒకటి, రెండు అని తెలుగులోనో.. వన్, టూ, త్రీ అని ఇంగ్లీషులోనో.. ఇవన్నీ కాదని.. టిక్ (రైట్ మార్క్) పెట్టటమో చేస్తే.. ఆ ఓటు కూడా చెల్లదు.
- ఒక ఓటరు ఒక్కరికే ఓటు వేయవచ్చు.. లేదా కొంత మందికి లేదా అందరికీ ఓటు వేయవచ్చు. అది మన ఇష్టం. ప్రాధాన్య క్రమాన్ని మాత్రం తప్పవద్దు.
- ఎన్నికల అధికారి సూచించిన దాని ప్రకారమే బ్యాలెట్ పేపర్ను జాగ్రత్తగా మడత పెట్టి బాక్సులో వేయాలి.
- ఫస్ట్ ప్రయారిటీ ఓటు (1) వేయకుంటే ఆ ఓటును రిజెక్ట్ చేస్తారు. 1 అంకె వేయకుండా 2, 3, 4.. వేస్తే ఆ ఓటు చెల్లదు.
- ఒక క్యాండిడేట్కు ఇచ్చిన నంబర్ మరో క్యాండిడేట్కు ఇవ్వొద్దు. ఒకే నంబర్ ఇద్దరు, ముగ్గురికి వేస్తే ఆ ఓటు చెల్లదు.
- బాక్స్లో కేవలం నంబర్ మాత్రమే వేయాలి. టిక్, రౌండప్, సంతకం, వేలి ముద్ర, ఇంటూ మార్క్, పేర్లు, గీతలు, చుక్కలు రాయొద్దు. అంకెను అక్షరాల్లో రాయొద్దు. బ్యాలెట్పై ఏమైనా రాసినట్లు గుర్తిస్తే ఓటును రిజెక్ట్ చేస్తారు
ఇక.. ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఓటరు తన వెంట.. ఓటర్ ఐటీ కార్డు లేదా.. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, పాన్ కార్డు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీచేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజనల్ సర్టిఫికేట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు ఇలా ఏదో ఒకటి తీసుకెళ్లి.. బూతులో ఉన్న పోలింగ్ ఆఫీసర్‌కు చూపించాల్సి ఉంటుంది.
కౌంటింగ్ ఇలా..
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పెద్ద ప్రహాసనం. రెండు, మూడు రోజులు కౌంటింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్‌కు ఏజెంట్‌కు వెళ్లాలంటేనే కనీసం రెండు రోజులు గడుపుతామనే భావన ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు లక్ష ఓట్లు పోలైతే 50 వేల ఒకటి తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికొస్తాయో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ‘ఏ’అనే అభ్యర్థికి 46 వేలు , బీ అనే అభ్యర్థికి 34 వేలు ఓట్లు, సీ అనే అభ్యర్థికి 10వేల ఓట్లు వచ్చాయనుకోండి. పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ రాలేదు. కాబట్టి వీరిలో ఎవరినీ విజేతగా ప్రకటించరు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే అతి తక్కువుగా వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు.
అతి తక్కువగా ఓట్లు పోలైన సీఅనే అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, అతని ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికిచ్చారనే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రెండో ప్రాధాన్యంలో ‘ఏ’అనే అభ్యర్థికి 2 వేలు ఓట్లు, బీ అనే అభ్యర్థికి 18 వేలు ఓట్లు వచ్చాయనుకోండి. మొత్తం ‘ఏ’అనే అభ్యర్థికి 46,000+2,000=48 ,000ఓట్లు, బీ అనే అభ్యర్థికి 34,000+18,000=52,000 ఓట్లు వచ్చినట్టు లెక్క. దీంతో బీ అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. గెలుపులో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి.