గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
  • ప్రభుత్వ పథకాలు, యువతను ఆకర్షించే పనులపై ప్రచారం చేయాలి
  • ఎమ్మెల్సీ ఎన్నిక జూమ్ సమావేశంలో సీఎం

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్  కుమార్  గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్  జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూమ్  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్  మున్షీ, కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథంతో పాటు నాలుగు జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాలు, యువతను ఆకర్షించే పనులపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్  కుమార్  గౌడ్  వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల కాబట్టి అత్యంత పకడ్బందీగా ముందుకు పోవాలని  సూచించారు. చాలా మంది గ్రాడ్యుయేషన్  పూర్తిచేసి ఉంటారని, వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించి వచ్చే ఎన్నికల్లో వారు మన వైపు ఉండేలా చూసుకోవాలన్నారు. వెంటనే ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ నెల 15 వరకు ఎన్నికలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్  మున్షీ మాట్లాడుతూ.. ఓటరు నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్  కుమార్  గౌడ్  మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు, సమన్వయ కమిటీ, పని విభజన, అభ్యర్థి ఎంపిక లాంటివి వెంటనే చేపట్టి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదు చాలా కీలకమన్నారు.