మరో ఎన్నిక వైపు.. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపుతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖాళీ

  • నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా 
  • ఇంకో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసే చాన్స్

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో మరో ఎన్నిక జరగనుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్​ కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.  2021 మార్చి 14న గ్రాడ్యుయేట్​ ఎన్నికలు జరగగా... ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది.  మరో నాలుగేళ్లు సమయం ఉండగానే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్సీకి రిజైన్ చేయడం అనివార్యమైంది.  

పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​ జారీ చేయాల్సి ఉంటుంది.  ఇదే టైంలో రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు నోటిఫి కేషన్​ విడుదల కానుంది. ఈ రెండు ఎన్నికలకు కొంచెం అటుఇటుగా నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉండొచ్చని  జిల్లా అధికారులు తెలిపారు.

71 మంది అభ్యర్థులు

2021లో  నల్గొండ, ఖమ్మం, వరంగల్‌తో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయి. అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతో నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, యువకులు, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు విలక్షణ తీర్పు ఇస్తారని భావించారు.  కానీ, రెండు చోట్ల బీఆర్‌‌ఎస్ అభ్యర్థులు  పీవీ నర్సింహా రావు కుమార్తె వాణి దేవీ,  పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

 తీన్మార్​ మల్లన్న వర్సెస్ పల్లా

బీఆర్ఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతో  కాంగ్రెస్​, బీజేపీతో పాటు  తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్​కోదండరామ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్​ చెరుకు సుధాకర్​ బరిలో నిలిచారు.  దీంతో ఎమ్మెల్సీ పోరు సాధారణ ఎన్నికలను తలపించింది.  ముఖ్యంగా తీన్మార్​ మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

76 మంది అభ్యర్థులు కావడంతో  ఓట్లు లెక్కించడా నికే నాలుగు రోజుల సమయం పట్టింది.  అధికారులు, అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓటతోనే బయటపడతామని భావించిన పల్లా రాజేశ్వరెడ్డికి తీన్మార్​ మల్లన్న చుక్కలు చూపించారు. నిజానికిగా కోదండరామ్​ గట్టిపోటీ ఇస్తాడని భావిస్తే గ్రాడ్యేయేట్లు తీన్మార్ మల్లన్న వైపు మొగ్గుచూపారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోదండరామ్​ఎలిమినేట్​ కాగా, చివరి రౌండ్​ వరకు తీన్మార్​ మల్లన్న టఫ్​ఫైట్​ఇచ్చారు.  

భారీ స్థాయిలో ఓటరు నమోదు

 నిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు బీఆర్​ఎస్​ పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని చోట్ల ఎమ్మెల్యేలను ఇన్​చార్జిలుగా పెట్టి క్యాంప్​ ఆఫీసుల్లోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఓపెన్​ చేయించింది. దీంతో మూడు జిల్లాల్లో కలిపి 5,05,565 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో  3,85,966 మంది ఓ టు హక్కు వినియోగించుకున్నారు.