
- గెలుపే లక్ష్యంగా ఓట్ల కోసం పడరాని పాట్లు
- ముఖ్యనేతలతోమీటింగ్లు, గెలుపు కోసం వ్యూహాలు
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, ఆయా సంఘాలు
- ఇంటింటికీ తిరిగి తమ అభ్యర్థికి ఫస్ట్ప్రయార్టీ ఓటు వేయాలని అభ్యర్థన
కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గెలుపే లక్ష్యంగా చివరి రోజు ఆయా పార్టీలు, సంఘాలు జోరుగా ప్రచారం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. ఓట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఆయా పార్టీల ముఖ్య నేతలతో మీటింగ్‌లు నిర్వహించి గెలుపు కోసం వ్యూహాలు పన్నారు. ఇంటింటికీ వెళ్లి తమ అభ్యర్థికి ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని అభ్యర్థించారు. మద్దతు కూడగట్టి ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓట్లు మొత్తం 16,410 ఉండగా పురుషులు 11,616, మహిళలు 4,793, ఇతరులు ఒకరు ఉన్నారు.
టీచర్ ఓట్లు మొత్తం 2,011 కు గాను పురుషులు 1,307, మహిళలు 704 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీలో ఉండగా, మిగతా వారు ఇండిపెండెంట్లుగా ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ మల్క కొమురయ్యను బరిలో దించగా, మిగతా 14 మంది ఆయా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నారు.
ప్రచార జోరు ...
వారం రోజులకుపైగా ప్రచారం జోరుగా సాగింది. అంతకు ముందు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఓటర్లతో మీటింగ్‌లు నిర్వహించి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అభ్యర్థుల తరఫున కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తమతమ అభ్యర్థికి ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలంటూ కోరారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ఈ నెల 19న కామారెడ్డి, బాన్సువాడల్లో నిర్వహించిన మీటింగ్‌ల్లో పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మండలాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మీటింగ్ లు నిర్వహించారు. ఓటర్ల వారీగా ఇన్చార్జీలను నియమించి ప్రచారం చేశారు.
బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ అభ్యర్థి కొమురయ్యకు మద్దతుగా ఈ నెల 22న కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్లు, టీచర్లు, లెక్చరర్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. 20 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ని నియమించి విస్తృతంగా ప్రచారం చేశారు. టీచర్లు, లెక్చరర్ల ఇండ్లకు వెళ్లి తమ అభ్యర్థులకు ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని కోరారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్‌లు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపించింది.
ప్రలోభాలు షురూ..!
ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో ఆయా పార్టీల నేతలు బిజీ అయ్యారు. ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ప్రతి మండలంలో ఇద్దరు ఇన్చార్టీలను నియమించినట్లు తెలుస్తున్నది. టీచర్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఇస్తున్నట్లు, దావత్‌లు ఇవ్వడంతో పాటు స్వీటు బాక్స్‌లను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
ప్రచారానికి తెర
నిజామాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. మైక్‌లు మూగబోయాయి. వివిధ పార్టీల నాయకుల హడావుడికి తెర పడింది. రేపు నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం విశేషం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్నరేందర్రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి బరిలో ఉన్నారు.
రెండు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ యూనియన్ మద్దతుతో బరిలోకి దిగిన వంగ మహేందర్‌రెడ్డి, ఎస్టీయూ సపోర్టుతో పోటీ చేస్తున్న కూర రఘోత్తంరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి అశోక్‌కుమార్ ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి హరికృష్ణ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు.