
- అంబేద్కర్ స్టేడియానికి మూడంచెల భద్రత
కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాయి. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల పరిశీలకుడు బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా, బుద్ధ ప్రకాశ్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్‌లకు శుక్రవారం తెల్లవారుజామున సీల్ వేశారు. అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూములకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి నుంచి బ్యాలెట్ బాక్సులు రావడం మొదలైందని.. శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం బాక్సులు స్ట్రాంగ్ రూముకు చేర్చినట్లు తెలిపారు. ఎన్నికల అధికారుల కృషి, వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. మార్చి 3 నుంచి జరిగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లపై నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.