గ్రాడ్యుయేట్లను పట్టించుకోని టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలె

తెలంగాణ ఏర్పడితే మన కొలువులు మనకొస్తా యనుకున్నాం. మన ఉద్యోగులకు విలువ పెరుగుతుందని భావించాం. ప్రమోషన్లు, పీఆర్సీలు అన్నీ సక్రమంగా వస్తాయని ఆశించాం. కానీ నిరుద్యోగ యువతకు కొలువుల భర్తీ లేదు. టీచర్లు, ఉద్యోగులకు ప్రమోషన్లు, సరైన ఫిట్మెంట్ ఇయ్యలేదు. కరోనా టైమ్లో ప్రైవేటు టీచర్ల పరిస్థితి దారుణం. జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇయ్యాల్టి పరిస్థితులే కాదు, ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనకు లెక్కలు కట్టి, విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందన్నది  ఆలోచించి ఓటేయాలి.

తెలంగాణలో సుమారు 12,088 ప్రైవేటు స్కూళ్లు ఉంటే, వాటిలో పనిచేసే 2.5 లక్షల మంది టీచర్ల జీవితాలు ‘కరోనా సంక్షోభం’, ప్రభుత్వ అలసత్వంతో తలకిందులయ్యాయి. 1498 ప్రైవేటు జూనియర్ కాలేజీలు, 600కు పైగా డిగ్రీ కాలేజీల్లోని సుమారు 40 వేల మంది లెక్చరర్ల కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. వీళ్లంతా ఒక్కసారిగా అడ్డా కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా మారిన పరిస్థితి దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం, సీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కారణం. ఇక ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలకు అంతే లేదు. ఈ టైమ్లో వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ వర్గాలు అదును చూసి దెబ్బకొట్టే మంచి అవకాశం.
మంత్రులంతా ప్రచారంలోనే..
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎట్లన్నా గెలవాలని మంత్రులకు హుకుం జారీ చేశారు. 15 రోజులుగా ప్రగతిభవన్లో తిష్ఠ వేసి, రోజువారీగా సమీక్షలు, సర్వేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులందరికి ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచారం, గెలుపు బాధ్యతలను అప్పగించారు. విందులు, వినోదాలు, సుక్క ముక్క సమావేశాలు, సభలు.. ఇలా ‘అధికార పార్టీ’ ప్రలోభాలకు అంతేలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార సరళి చూస్తూ ఉంటే సాధారణ ఎన్నికల ప్రచారాన్ని మించిపోతున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికను డబ్బుతో ముడి పెట్టి, ఓటర్లకు నోట్లను ఎరగా చూపి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే కొత్త ట్రెండ్కు తెరలేపింది. ఎంత రేటిచ్చయినా ఓట్లు కొంటామన్న ధీమాతో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోంది. తెలంగాణ సహజ వనరుల దోపిడీ, ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి అవినీతి, కుంభకోణాలకు పాల్పడి గడించిన వేల కోట్ల సొమ్ముతో ఒక్కో ఓటుకు వేలల్లో వెదజల్లుతోంది. నయానో, భయానో ఓటర్లను లొంగదీసుకోవడం, వినకపోతే టీచర్లు, ఉద్యోగులను బెదిరిస్తూ అధికార పార్టీ నేతలు దౌర్జన్య కాండకు పాల్పడుతున్నారు.
ఉద్యమానికి ఊపిరిపోసినోళ్లను అవమానించడమే
ఈ ఏడేండ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కారు కనీసం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 2018లో ఇవ్వాల్సిన పీఆర్సీ నేటికీ ఇవ్వలేదు. పక్కనున్న ఏపీలో ఐఆర్ 27% ఇస్తే.. మన రాష్ట్రంలో అతీగతీ లేదు. ప్రభుత్వం పీఆర్సీపై వేసిన కమిటీ కొండను తవ్వి, ఎలుకను పట్టిన చందంగా 7.5% ఫిట్మెంట్కు సిఫార్సు చేయించింది. హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సులను చేయించింది. దీంతో హైదరాబాద్లో డ్యూటీలు చేసే ఉద్యోగులు, టీచర్లకు, ఇప్పుడు వచ్చే వేతనాల కన్నా కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులకు జీతాలు ఇంకా తగ్గుతాయి. ఆనాడు తెలంగాణ సాధన కోసం సకలజనుల సమ్మెకు తెరలేపి ఉద్యమానికి ఊపిరిపోసిన టీచర్లు, ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం 7.5% ఫిట్మెంట్ ప్రకటన వారిని అవమానించడమే. ఇదేనా బంగారు తెలంగాణలో ఉద్యోగులకు ఇచ్చే కానుక! ఇదేనా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే! నేటికీ 3 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కరోనా నెపంతో తెలంగాణలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కట్ చేసిన సగం జీతాన్ని ఇప్పటికీ వాయిదాల పద్దతిలో ఇస్తూనే ఉన్నారు.
విద్యా శాఖపై చిన్నచూపు
తెలంగాణ వచ్చాక విద్యాశాఖకు భారీగా నష్టం జరిగింది. బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ విద్యారంగం పట్ల టీఆర్ఎస్ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్న ప్రభుత్వం ఆ హామీని గాలికొదిలేసింది. అద్దె భవనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చాలీచాలని జీతాలతో బోధన, బోధనేతర సిబ్బందితో నెట్టుకొస్తోంది. 20 ఏండ్ల నుంచి నానుతున్న కామన్ సర్వీస్ రూల్స్ సమస్యకు కేంద్రం సానుకూల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించని కారణంగా నేటికీ సర్వీసు రూల్స్ లేవు. దేశంలో సర్వీసు రూల్స్ లేకుండా ఉన్నది తెలంగాణలోనే. ఆంధ్రప్రదేశ్లో కూడా లేకున్నా అక్కడ ప్రమోషన్స్, ఐఆర్ ఇచ్చారు. సర్వీసు రూల్స్ లేవన్న నెపంతో విద్యారంగంలో పనిచేస్తున్న టీచర్లు 20–25 ఏండ్లపాటు ఒకే కేడర్లో ఉండిపోయి, అలాగే రిటైర్ అవుతున్న ఏకైక రాష్ట్రం మనది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఆదాయం లేదని, రాబడి లేని శాఖలా విద్యా శాఖను ప్రభుత్వం చూస్తున్నది. రేషనలైజేషన్ పేరు మీద వందలాది స్కూళ్లను మూసేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలనూ మూసివేసే దిశగా కుట్రలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తున్నది. మరోవైపు  కేంద్రం సర్వశిక్షాభియాన్ ద్వారా స్కూల్ గ్రాంట్, మెయింటెనెన్స్ గ్రాంట్, మధ్యాహ్న భోజనం లాంటి వాటికి భారీగా నిధులు ఇస్తున్నా వాటిని వినియోగించడంలో టీఆర్ఎస్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతున్నది.
ఇప్పటికీ వీసీలు లేరు..
ఉన్నత విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వీసీల నియామకాలు చేపట్టకుండా గాలికి వదిలేశారు. ఉస్మానియా, కాకతీయ లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో 60% పైగా లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేక ఎన్నో డిపార్టుమెంట్లు మూతపడ్డాయి. దాంతో పరిశోధనలు జరగటం లేదు. వేలాది పోస్టులు భర్తీ చేయకుండా, అధికారపార్టీ నాయకుల ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులిచ్చి పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలకు టీఆర్ఎస్ సర్కారు పాల్పడుతోంది.
ఉద్యోగాల భర్తీపై కాకి లెక్కలు
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర వాటాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 6, 23,676 కాగా, అందులో 83 వేల మంది ఆంధ్ర ఉద్యోగులున్నారని, వారిని ఆ రాష్ట్రానికి పంపించి, ఆ ఖాళీల్లో తెలంగాణ నిరుద్యోగ యువతను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల పీఆర్సీ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గడిచిన ఏడేండ్లలో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 33 జిల్లాలు అయ్యాక33 కలెక్టరేట్లు, 584 మండలాలు, 126 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 12,751 గ్రామ పంచాయితీలు, 9 పోలీస్ కమిషనరేట్లు, 114 పోలీస్ సబ్ డివిజన్లు, 715 పోలీస్ స్టేషన్లు, 78 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ సజావుగా పనిచేయాలంటే, కనీసం జిల్లాలో 2000 మంది ఉద్యోగుల చొప్పున 66 వేల ఉద్యోగాలు అవసరం. అంటే రాష్ట్రంలో దాదాపు మొత్తం 3 లక్షల 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీచేసామని కాకి లెక్కలు చెబుతూ సర్కారు మాయ చేస్తున్నది. టీఎస్పీఎస్సీ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 24 లక్షల 4 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అంటే నిరుద్యోగ సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోండి.
సర్కారు పని తీరు కొలమానంగా ఓటేయాలి

తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లంతా విద్యావంతులు, విజ్ఞులు. అన్ని కోణాలనుండి ఆలోచన చేసి, వారి ప్రయోజనాలు కాపాడే అభ్యర్థి ఎవరు, ఏ పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరి ప్రయోజనాల కోసం అభ్యర్థులు, పార్టీలు పనిచేస్తున్నాయో ఆలోచించి ఓటు వేయాలి. మార్పు కోసం గ్రాడ్యుయేట్లు అడుగేయాలి. అందుకు ప్రభుత్వ పనితీరు, హామీలు, ప్రభుత్వ, -ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ యువత, పెన్షనర్ల సమస్యలు వంటి అంశాలపై ఏడేండ్లుగా ఇచ్చిన హామీలు, పరిష్కారాలు మాత్రమే కొలమానం కావాలి. టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీలేంటి? నెరవేర్చినవేంటి? ఈ వర్గాల ప్రజలకు చేసిందేమిటి? అనేది బేరీజు వేసుకోవాలి.
ప్రతి నిరుద్యోగికి రూ.80 వేల భృతి బాకీ 
2014లో రాష్ట్రంలో నిరుద్యోగం 2.7 శాతం ఉంటే 2019 నాటికి 8.3 శాతానికి పెరిగిం ది. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగులు 7.3 శాతం ఉంటే ఇప్పుడది 27.7 శాతానికి చేరుకుంది. పోస్టు గ్రాడ్యుయేట్లలో 7.3 శాతం ఉంటే ఇప్పుడు 31.3 శాతానికి చేరువవుతోంది. కొలువుల కోసం తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, నేడు నిరుద్యోగ యువతకు కొలువులు రావటం లేదు కానీ, అధికారపార్టీ నేతల కుటుంబాల్లో మాత్రం రాజకీయ ఉద్యోగాలులు క్రమం తప్పకుండా భర్తీ అవుతున్నాయి. కొలువులు ఇవ్వలేని వారికి నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామన్నారు. రెండేండ్లు గడుస్తున్నా ఒక్కరికీ భృతి ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికీ ప్రభుత్వం దాదాపు రూ. 80 వేలు బాకీ ఉన్నది. ఆ బాకీ తీర్చాలంటే 2000 కోట్లు కావాలి.-డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా