ఫట్టభద్రులు పట్టించుకోవట్లే! ..ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు

  • వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారుల డిలే.. 
  • ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 56,179 దరఖాస్తులు
  • వెరిఫికేషన్ కంప్లీట్ అయినవి 4,137లోపు మాత్రమే
  • గత ఎన్నికల్లో లక్ష మందికి పైగా నమోదు 
  • అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో దృష్టిపెట్టని పార్టీలు 
  • ఓటరు నమోదుపై కానరాని ప్రచారం
  • ఫిబ్రవరి 6న ముగియనున్న గడువు 

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా చాలా స్లోగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 6న గడువు ముగియనుండగా ఇప్పటి వరకు 56,179 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అందులో పరిశీలన పూర్తయినవి 4,137 మాత్రమే ఉన్నాయి. గత ఎన్నికల్లో లక్షకుపైగా నమోదు కాగా, ఈసారి అందులో సగం మాత్రమే నమోదయ్యాయి. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో పాటు ఓటరు నమోదుపై ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. 

ఎక్కడెక్కడ.. ఏ పరిస్థితి?

  •   భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 13,550 మంది మాత్రమే ఓటరు నమోదు కోసం పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో పరిశీలన అనంతరం ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసినవి 1,100 లోపు మాత్రమే ఉన్నాయి. అశ్వాపురం మండలంలో 500, దుమ్ముగూడెం మండలంలో 255, భద్రాచలం మండలంలో 550 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి కాలేదు. చండ్రుగొండ మండలంలో 248 దరఖాస్తులకు గానూ 6, టేకులపల్లి మండలంలో 731, అశ్వారావుపేట మండలంలో దాదాపు 491 దరఖాస్తులకు గానూ ఒక్కొక్కటి చొప్పున మాత్రమే వెరిఫికేషన్ పూర్తయ్యాయి. కొత్తగూడెం, మణుగూరు లాంటి మండలాల్లో మాత్ర ందాదాపు 300 దరఖాస్తుల చొప్పున వెరిఫికేషన్ పూర్తయ్యింది. 
  •   ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 42, 629 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఆన్ లైన్ ద్వారా 41572 అప్లికేషన్లు రాగా, ఆఫ్ లైన్ ద్వారా 1057 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 3,037 అప్లికేషన్లను యాక్సెప్ట్ చేయగా, 53 అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. 39, 539 అప్లికేషన్లు బీఎల్ఓల స్థాయిలో, ఈఆర్వోల స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి. కొణిజర్ల, కూసుమంచి, పెనుబల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం, వేంసూరు, వైరా మండలాల్లో ఒక్కో మండలంలో వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా ఒక్క దరఖాస్తును కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. ఇక ఏన్కూరు, మధిర, రఘునాథపాలెం మండలాల్లో సింగిల్ డిజిట్ లోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ముదిగొండ, ఖమ్మం రూరల్, చింతకాని మండలాలు మాత్రం దరఖాస్తుల పరిశీలనలో ముందంజలో ఉన్నాయి. 

ప్రచార లోపం.. ఫైనల్ కాని అభ్యర్థులు.. 

పట్టభద్రుల ఓటరు నమోదు స్లోగా ఉండడంపై పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ డాక్టర్లు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన స్పీడ్​గా చేయాలని ఆదేశించారు. కానీ ఆశించినంత ఫలితం మాత్రం రావడం లేదు. అలాగే పలు పార్టీల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఫైనల్ కాకపోవడంతో ఆటు పార్టీలు, ఇటు సంఘాలు ఓటరు నమోదుపై పెద్దగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఓటరు నమోదుకు మరో వారం రోజు మాత్రమే గడవు ఉన్నందున ఇప్పటికైనా పార్టీలు, సంఘాలు, అధికారలు ప్రచారం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.