నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులు ఆలోచించి ఓటెయ్యాలని, విద్యావంతుడిని, ప్రశ్నించే వ్యక్తినే గెలిపించుకోవాలని ఓటర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం నల్గొండలో పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆయన మాట్లాడారు. వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిం దని, కానీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని స న్నాయి నొక్కులు నొక్కుతోందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. గత సర్కారు నోటిఫికేషన్లు వేస్తే.. కాంగ్రెస్ సర్కారు కేవలం అపాయింట్మెంట్ లెటర్లు చేతుల్లో పెట్టి 30 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని చెప్పుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అపఖ్యాతి మూట గట్టుకున్నదన్నారు. మిర్యాలగూడ, హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశాల్లోనూ కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాటలకు భాస్కర్ రావు లాంటి గొప్ప నాయకున్ని మిర్యాలగూడ కోల్పోయిందని మరోసారి మోసపోవద్దన్నారు.
గెలిపిస్తే పోరాడతా..
నల్గొండలో జరిగిన సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి పోరాడతానన్నారు. సమావేశంలో సూర్యపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియాలోని లక్ష్మీనరసింహా గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలోనూ రాకేశ్ రెడ్డి మాట్లాడారు.
బోనస్‌పై చేతులెత్తేయడం కాంగ్రెస్ మార్కు మోసం
వరి పంటకు రూ.500 బోనస్ అని ఎన్నికల సమయంలో తన గ్యారెంటీ కార్డులో పేర్కొని, ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ మార్కు మోసమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని చెప్పి అధికారంలోకి రాగానే చేత్తులెత్తేశారని ఆరోపించారు. మంగళవారం ఈ అంశంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, రైతు వ్యతిరేక పాలన అని చెప్పారు. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడం కాంగ్రెస్ నైజమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో గారడీ చేసిందని పేర్కొన్నారు.