Graham Thorpe: థోర్ప్ రెండేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు.. భార్య అమండా షాకింగ్ కామెంట్స్

ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ సోమవారం ఉదయం (ఆగస్టు 5) మరణించిన వార్త ఇంగ్లాండ్ క్రికెట్ లో విషాదాన్ని నింపింది.  ఈ విషయాన్ని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక పత్రికా ప్రకటనలో అతను మరణించినట్లు తెలిపింది. అతని వయసు 55 సంవత్సరాలే కావడం గమనార్హం. అయితే థోర్ప్ మరణానికి కారణాలు తెలియలేదు. థోర్ప్ డిప్రెషన్ కు లోనయ్యి సుదీర్ఘ పోరాటం తర్వాత తన జీవితాన్ని ముగించాడని తాజాగా అతని భార్య షాకింగ్ విషయాలను వెల్లడించింది. ప్రేమించిన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ అతను బాగుపడలేదని ఆమె తెలిపింది.

"ఇటీవలే కాలంలో థోర్ప్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. రెండేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. మే 2022 లో అతని లైఫ్ చాలా తీవ్రంగా మారింది. ఈ కారణంగానే అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఎక్కువ కాలం ఉండవలసి వచ్చింది. మేము అతనికి కుటుంబంగా ఎంతో సపోర్ట్ చేశాము. అతనికి చాలా చికిత్సలు అందించినా దురదృష్టవశాత్తు వాటిలో ఏదీ పని పని చేయలేదు". అని థోర్ప్ భార్య తెలిపింది. 

1969లో జన్మించిన థోర్ప్.. 1993లో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఇతను ఒకడు. వీటితో 82 వన్డేలను ఆడాడు. మొత్తం 16 సెంచరీలతో పాటు 9000 పైగా పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్రే తరపున కౌంటీ మ్యాచ్ ల్లో 49 సెంచరీలు.. 45.04 సగటుతో 21,937 పరుగులు చేశాడు. ఈ లెజెండ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ తో పాటు సర్రే క్రికెట్ కౌంటీ కూడా నివాళులర్పించింది.