ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభం

  • వెలుగు కథనానికి అధికారుల స్పందన 

జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : జనగామ జిల్లాలోని 12 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించినట్లు జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్​ రోజారాణి తెలిపారు. ‘వెలుగు’ దినపత్రికలో ‘కొనుగోలు లేట్’ అని యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై శనివారం   కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు శనివారమే స్పందించి సెంటర్లు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 190 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని

ప్రస్తుతం మండలానికి ఒకటి స్టార్ట్​ చేశామని అన్నారు. బచ్చన్నపేటలో కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ చేతుల మీదుగా సెంటర్​ ప్రారంభం కాగా మిగతా మండలాల్లో అధికారులు ప్రారంభించారని చెప్పారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే టోల్​ ఫ్రీ నంబర్​ 6303928718 కు ఫోన్​ చేయాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 

కలెక్టరేట్​ సమీక్ష  : యాసంగి వరిధాన్యం కొనుగోళ్లలో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​ లోని కాన్ఫరెన్స్​ హాల్​లో అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారు.  సెంటర్​ ల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టోకెన్లు ఇవ్వాలని ఆదేశించారు.

అంతకుముందు సెంటర్​ నిర్వాహకులు, ఏఈఓలకు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా శిక్షణ ఇచ్చారు.  కార్యక్రమంలో డీఎస్​ఓ రోజారాణి, డీఏఓ వినోద్​ కుమార్​, డీసీఓ రాజేందర్​ రెడ్డి, డీటీసీఎస్​లు శ్రీనివాస్​, దేవా పాల్గొన్నారు.