పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరి పది రోజులు దాటినా ఇప్పటి వరకు ఒక్క సెంటర్ లో కూడా కొనుగోళ్లు స్టార్ట్ కాలేదు. 300 కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ధాన్యం కొనుగోలు లేట్ అవుతుండటంతో రైతులు ధాన్యం కుప్పల కాడనే రాత్రుళ్లు పడుకోవాల్సి వస్తోంది. కేంద్రాల్లోనే ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో వారం రోజులుగా మబ్బులు పడుతున్నాయి. చాలా చోట్ల వర్షాలు పడటంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఎంత ఎండబోసినా ధాన్యంలో మాయిశ్చర్(తేమ శాతం) తగ్గటం లేదు. దీన్ని కారణంగా చూపి సొసైటీ వారు ధాన్యం కొంట లేరు. దీంతో కొంత మంది రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎవరికి చెప్పినా ఏం ప్రయోజనం ఉంటలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం దిగుబడి 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2.10 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగుబడి అయింది.
ఎవరూ పట్టించుకుంటలేరు...
మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నిర్వహణ విషయంలో చేతులెత్తేసింది. కోతలు స్టార్ట్ అయి 15 రోజులు అయింది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు స్టార్ట్ కాకపోవడంతో, వేలాది మంది రైతులు ధాన్యం కేంద్రాల వద్ద పగలు, రాత్రి ఉండాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ లాంటి ఫారెస్ట్ సమీప రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కుప్పల వద్దకు అడవి పందులు వస్తుండటంతో రైతులంతా రాత్రులు ధాన్యం కుప్పల కాడనే ఉండాల్సిన పరిస్థితి. సకాలంలో కొనకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు, అధికారులు ఒకటై రైతులను కొనుగోలు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. నిర్దేశిత మాయిశ్చర్17 శాతం రావాలి. కానీ వాతావరణ పరిస్థితులతో మబ్బులు పడుతుండటంతో మాయిశ్చర్ 17 రావటం లేదు.
పోయినేడు తూర్పార పట్టినా తరుగు తీసిండ్రు...
పోయినేడు తూర్పార పట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపించినా మిల్లర్లు కచ్చితంగా ప్రతి సంచికి 3 నుంచి 5 కేజీలు తరుగు కింద కోత పెట్టారని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తర్వాత రైసు మిల్లుకు 40 కేజీల బస్తాను పంపిస్తే దానిపై 5 కేజీల వరకు మిల్లర్లు తరగు తీస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో రైసు మిల్లర్లతో నిర్వాహకులు కుమ్మక్కై తూర్పారా పట్టని ధాన్యాన్ని 3 కేజీల కోతతో తీసుకుంటున్నారు. అదే ధాన్యాన్ని మిల్లుకు పంపగానే అక్కడ మిల్లర్లు మరో 5 కేజీలు తరుగు కింద కోత పెడుతున్నారు. రైతుల అమాయకత్వాన్ని మిల్లర్లు, అధికారులు, సెంటర్ నిర్వాహకులు దోచుకుంటున్నారు. బయటకు కనిపించకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో సెంటర్ నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లు పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. ఒకవైపు అధికారులు ఎక్కడైనా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కానీ ఫిర్యాదు చేసినా ఎక్కడా చర్యలు తీసుకోలేదు.
పోసి పది రోజులైనా కొంటలేరు...
ధాన్యం పోసి పది రోజులైంది. మాయిశ్చర్ రాలేదని కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేయలేదు. ఓ వైపు వర్షాల పడుతున్నాయి. దీంతో ధాన్యంలో మాయిశ్చర్ రావడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. వెంటనే ప్రభుత్వం సెంటర్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
- కొట్టె శంకర్, కునారం, పెద్దపల్లి జిల్లా