రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 
  • ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

గంగాధర, రామడుగు, వెలుగు : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, యాసంగి పంటకాలానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించామని, తరుగు, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం కురిక్యాల, రామడుగు మండల కేంద్రంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రూ.72 వేల కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.  కాంగ్రెస్ హయాంలోనే శ్రీపాదసాగర్, ఎస్సారెస్పీ, కడెం వంటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వరద కాలువ, కాకతీయ కాలువల ద్వారా సమృద్ధిగా సాగునీరు వస్తోందన్నారు.

 ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఎలాంటి కటింగ్స్​ లేకుండా కొనుగోలుకు ఆదేశించామన్నారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ  అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 48 గంటల్లోగా రైతులకు ధాన్యం డబ్బులు వచ్చేలా ఆన్​లైన్​లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీసీవో రామానుజాచార్యులు, సివిల్​ సప్లై డీఎం రజినీకాంత్​, తహసీల్దార్లు అనుపమరావు, వెంకటలక్ష్మి, ఎంపీడీవోలు దమ్మని రాము, రాజేశ్వరి, పీఎసీఎస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.