జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు క్లోజ్

జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు క్లోజ్
  •     జనగామ జిల్లాలో 1,26,358 మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ
  •     రూ.272 కోట్ల 38 లక్షల చెల్లింపులు
  •     సజావుగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా 195 సెంటర్లలో  ధాన్యం సేకరణ ప్రక్రియపూర్తయ్యింది.  డబ్బులు సైతం  రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యాన్ని సెంటర్ల నుంచి మిల్లులకు తరలించారు. మరోవైపు జిల్లాలో వానాకాలం పనులు ఊపందుకుంటున్నాయి. 

సెంటర్ల ఎత్తివేత..

జనగామ జిల్లాలో 95,610 ఎకరాల్లో యాసంగి వరి పంటను రైతులు సాగు చేశారు. ఈ క్రమంలో అధికారులు 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ  టార్గెట్​గా పెట్టుకున్నారు. మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్​ సింగ్​ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వడ్ల కొనుగోళ్లు సజావుగా పూర్తి చేసేందుకు యంత్రాగాన్ని పరుగులు పెట్టించారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో సెంటర్లన్నీ ఎత్తేశారు.

1,26,358 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. 

యాసంగి సీజన్​లో 24,919 మంది రైతుల వద్ద నుంచి 1,26,358 మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశారు. వీరికి రూ.278 కోట్ల 35 లక్షల చెల్లింపులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.272 కోట్ల 38 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన రూ.5 కోట్ల 97 లక్షల మొత్తాన్ని కూడా మరో రెండు, మూడు వర్కింగ్ డేస్ లలో రైతుల ఖాతాల్లో వేస్తామని ఆఫీసర్లు తెలిపారు. ఇదిలాఉండగా, శనివారం నుంచి మృగశిర కార్తె ప్రారంభం కావడంతో రైతులు వానాకాలం సాగు పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే రైతులు పత్తి విత్తనాల కొనుగోళ్లు దాదాపుగా పూర్తి చేసి, విత్తనాలను నాటారు. 

సజావుగా కొనుగోళ్లు పూర్తి.. 

యాసంగి ధాన్యం కొనుగోళ్లను సజావుగా పూర్తి చేశాం. 1,26,358 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోళ్లు జరిపి, ఇప్పటి వరకు రూ.272 కోట్ల 38 లక్షల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో రూ. 5 కోట్ల వరకు చెల్లింపులు జరుగాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నం.

- రోజారాణి, డీఎస్​ఓ, జనగామ