- సన్నాలకు బోనస్ చెల్లింపులు షురూ
- రెండు, మూడు రోజుల్లో ఖాతాల్లో జమ
- సర్కారుకు ధీటుగా ప్రైవేటు కొనుగోళ్లు
జనగామ, వెలుగు : ధాన్యం కొనుగోళ్లు స్పీడందుకున్నాయి. జనగామ జిల్లాలో అటు సర్కారు ఇటు ప్రైవేటు కొనుగోళ్లు పోటాపోటీగా సాగుతున్నాయి. సర్కారు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320 ఉండగా, ప్రైవేటులోనూ దాదాపుగా అదే ధర పలుకుతోంది. ఫలితంగా సర్కారు సెంటర్లకు ధాన్యం తక్కువగా వస్తుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
44 వేల మెట్రిక్ టన్నులు..
జనగామ జిల్లాలో వానాకాలం వడ్లను కొనేందుకు సర్కారు 180 సెంటర్లను ఏర్పాటు చేసింది. అధికారులు 2 లక్షల 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500ల బోనస్ చెల్లిస్తామని సర్కారు చెప్పినప్పటికీ సన్నాల సాగు విస్తీర్ణం పెరగలేదు. జిల్లాలో 65,989 ఎకరాల్లో సన్నరకం వరి సాగైతే, 1,37,406 ఎకరాల్లో దొడ్డు రకం పంట వేశారు. ప్రస్తుతం వరికోతలు మరో 10 రోజుల్లో ముగింపు దశకు రానుండగా, సర్కారు సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 44,674 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు.
ఈ లెక్కన అధికారులు వేసుకున్న టార్గెట్ సగానికి చేరుకోవడం కూడా కష్టంగానే మారింది. మరో వైపు జనగామ అగ్రికల్చర్ మార్కెట్‌యార్డులో క్వింటాల్‌కు రూ.2,300లకు పై చిలుకు ధర పడుతోంది. గురువారం మార్కెట్‌యార్డులో 115 మంది రైతులకు క్వింటాలుకు కనిష్టంగా రూ.1,984 గరిష్టంగా రూ.2,351 ధర పలికింది.
మాకంటే మాకు..
గత సీజన్లలో వడ్లు మాకొద్దంటే మాకొద్దని మిల్లర్లు మొండి కేయగా, ఇప్పుడు పరిస్థితి మారింది. మా మిల్లుకు వడ్లు కావాలంటే మా మిల్లుకు వడ్లు కావాలని మిల్లర్లు ఆఫీసర్ల పై ఒత్తిడి తెస్తున్నారు. ఫీల్డ్లెవల్ లో అనుకున్నంత మేర వడ్ల కొనుగోళ్లు సెంటర్ల ద్వారా జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో, మిల్లర్లు మిల్లింగ్కేపాసిటీ మేరకు వడ్లు అందించాలని పట్టుపడుతున్నారు. ఇదిలాఉండగా ధాన్యం డబ్బులు సైతం వెంటనే ఖాతాల్లో పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు ఎంట్రీ చేసిన రెండు, మూడు రోజుల్లో డీఎం లాగిన్ద్వారా మద్దతు ధర కల్పిస్తూ, పేమెంట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 8,871 మంది రైతుల నుంచి 44,674 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, వీరిలో 6089 మంది రైతులకు రూ.70 కోట్ల వరకు పేమెంట్స్చేశారు. 2700 మందికి రూ.34 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఖాతాల్లో జమ కొనసాగుతోంది. సన్నవడ్లకు బోనస్ డబ్బులు కూడా జమవడం మొదలైంది. ఇప్పటి వరకు 1263 మంది రైతుల నుంచి 5,324 మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశారు. 162 మంది రైతులకు రూ.36 లక్షల 10 వేలు బోనస్డబ్బులు చెల్లించారు.
సన్నరకం వడ్లకు సంబంధించి డీఎం లాగిన్ లో మద్దతు ధర వేసిన తదుపరి డీఎస్వో లాగిన్ లో రూ.500ల బోనస్ కోసం ఎంట్రీ చేస్తుండగా, డబ్బులు జమవుతున్నాయి. ధాన్యం చెల్లింపుల్లో 68 శాతంతో స్టేట్‌లో జనగామ జిల్లా టాప్‌ప్లేస్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
సజావుగా కొనుగోళ్లు..
ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్ టన్నుల పై చిలుకు దొడ్డు రకం, 5 వేల మెట్రిక్ టన్నుల పై చిలుకు సన్నరకం వడ్లు కొన్నాం. పేమెంట్లు కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కలెక్టర్రిజ్వాన్బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
- వీ హథీరామ్, సివిల్ సప్లై డీఎం, జనగామ