జనగామ అగ్రికల్చర్ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు షురూ

  • జనగామ మార్కెట్​ లో ముగిసిన వివాదం

జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఆఫీసర్ల ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు మంగళవారం ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఈ నామ్ పద్ధతిలో నాణ్యత ఆధారంగా ధరలు వేశారు. మద్దతు ధరలు ఆశాజనకంగా వేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, వారం క్రితం తక్కువ ధరకు వడ్లు కొంటున్నారని రైతుల ఆందోళనతో మార్కెట్లోని ముగ్గురు ట్రేడర్ల పై క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ట్రేడర్లు కొనుగోళ్లు బంద్​పెట్టారు.

దీంతో రైతుల ఆందోళన పెరగడంతో డీఎంవో నరేంద్ర, డిప్యూటీ డైరెక్టర్​రాజునాయక్, ఆర్డీవో కొమురయ్య, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ సమస్య పరిష్కారానికి ట్రేడర్లతో పలుమార్లు చర్చలు జరిపారు. రైతుల అంగీకారం మేరకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు చొరవ చూపి సమస్యను పరిష్కరించారు. మంగళవారం 282 మంది రైతులకు చెందిన 15,205 బస్తాల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. కనీస ధర రూ.1,713, గరిష్టంగా రూ.2,125 పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

మొక్కజొన్నలకు సర్కారు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,090 ఉండగా, మార్కెట్లో ట్రేడర్లు రూ.2200 ధర వేశారు. కాగా, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా మార్కెటింగ్​ అధికారి నరేంద్ర కోరారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 17, 18 తేదీల్లో మార్కెట్​కు సెలవుంటుందని తెలిపారు. రైతులు ధాన్యం తీసుకురావద్దని సూచించారు.