- బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ కంప్లీట్
- జిల్లాలో 426 పంచాయతీలు
- 3,698 వార్డులు, 5,20,441 మంది ఓటర్లు
యాదాద్రి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. సర్పంచుల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరి ఒకటిన ముగిసిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. ఇటీవల కులగణన నిర్వహించడంతోపాటు తాజాగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేతోపాటు గ్రామ సభల నిర్వహణ ఈనెల 26తో ముగుస్తుంది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో చర్చ మొదలైంది.
బ్యాలెట్ ప్రింటింగ్ కంప్లీట్..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులను కూడా ఇటీవలే ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 రకాల గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 రకాల గుర్తులను కేటాయించారు. వీటిలో ఎక్కువగా రెగ్యులర్‌గా వాడే వస్తువులే ఉన్నాయి. సర్పంచులకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు సిద్ధం అవుతున్నాయి.
సర్పంచులుగా పోటీ చేసేవారికి ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్ వంటివి 30 కేటాయించారు. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ వంటి 20 గుర్తులను కేటాయించారు. ఆయా గుర్తులతో అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ఇటీవల పూర్తయింది. బ్యాలెట్ బ్యాక్స్‌లను కూడా సిద్ధం చేశారు. నోటిఫికేషన్వెలువడడమే తరువాయి.. ఎన్నికలకు రెడీ అన్నట్టుగా ఉంది.
యాదాద్రి జిల్లాలో 426 పంచాయతీలు..
యాదాద్రి జిల్లాలో గతంలో 421 పంచాయతీలు ఉండగా, కొత్తగా ఐదు పంచాయతీలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 426కు చేరింది. వార్డుల సంఖ్య3,666 నుంచి 3,698కు చేరింది. జిల్లాలో 5,20,441 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 2,61,205 మంది, పురుషులు 2,59,233 మంది, ముగ్గురు ఇతరులు ఉన్నారు.
ఆసక్తి చూపుతున్న ఆశావహులు..
అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కాగా, లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఆరు నెలలు గడిచిన తర్వాత పంచాయతీ ఎన్నికలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రె'ఢీ' అవుతున్నాయి. ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఆయా పార్టీల లీడర్లు అంటున్నారు.
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముగియగానే సాధ్యమైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. దీంతో ఆయా పార్టీల నుంచి సర్పంచ్ కావాలన్న ఆశావహులు నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.