భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ర్యాలీ చేసిన తర్వాత ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే హరిప్రియకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హామీ ఇచ్చారు. పంచాయతీ కార్మికులు 13 రోజులుగా పలు డిమాండ్లతో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని, వేతనాలను పెంచి సకాలంలో అందజేయాలని 14 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం (జులై 18న) వామపక్ష పార్టీల మద్దతుతో ఆందోళన ఉధృతం చేశారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.