బిల్లులు ఇవ్వడం లేదని.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్...ట్రాలీ పట్కపోయిన్రు

బిల్లులు  ఇవ్వడం లేదని.. గ్రామ పంచాయతీ  ట్రాక్టర్...ట్రాలీ పట్కపోయిన్రు

కాగజ్ నగర్, వెలుగు : డీజిల్​బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆసిఫాబాద్​జిల్లా చింతలమనేపల్లి మండలం గంగాపూర్​గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను మల్టీపర్పస్​వర్కర్​తీసుకువెళ్లగా, జేసీబీతో చేసిన పని బిల్లు ఇవ్వడం లేదంటూ ట్రాలీని మరో వ్యక్తి పట్టుకుపోయాడు. అంబగట్ట గ్రామానికి చెందిన కోసన వాగన్న గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పనిచేస్తూ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డీజిల్​కు బిల్లు ఇస్తామని సర్పంచ్ విలాస్, పంచాయతీ కార్యదర్శి అశోక్ హామీ ఇవ్వడంతో ఏడాదిగా ఆ ట్రాక్టర్ లో అతడే డీజిల్​పోసుకొని నడిపిస్తున్నాడు. 

ఇప్పటి వరకు డీజిల్ కు రూ.లక్షా 40 వేల ఖర్చయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బుధవారం ట్రాక్టర్ ను తన ఇంటికి తీసుకుపోయాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన దండిగ బావన్న.. నాలీ తవ్వకం పనికి తన జేసీబీతో పనులు చేశానని, నెలలు గడుస్తున్నా సర్పంచ్ డబ్బులు ఇవ్వడం లేదని ట్రాలీని తీసుకుపోయాడు. రూ.40 వేలు ఇచ్చేదాక ట్రాలీ తన దగ్గర ఉంచుకుంటానని చెప్పాడు. ఈ విషయమై సర్పంచ్ విలాస్ ను వివరణ కోరగా ట్రాక్టర్ తీసుకుపోయిన మాట వాస్తవమేనని , మళ్లీ తెచ్చి పెట్టామని చెప్పాడు.  ట్రాక్టర్ తీసుకెళ్లిన వాగయ్యపై జీపీ సెక్రటరీ అశోక్ చింతల మానేపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు.