
హుస్నాబాద్, వెలుగు : ఈసారి బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితిలో పవర్లో కి రానివ్వబోమని గ్రామపంచాయతీ కార్మికులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రమొస్తే కాంట్రాక్టు నౌకర్లు ఉండవని, అందరినీ పర్మినెంట్ చేస్తమని కేసీఆర్అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చేపట్టి దీక్షా శిబిరంలో కార్మికులు మాట్లాడారు. ప్రభుత్వం కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
ఈపీఎఫ్, యూనిఫామ్, ఈఎస్ఐ, సబ్బులు, మంచి నూనె, చెప్పులు లాంటి వాటికి అలవెన్సులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. జీవో నంబర్ 66 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, ఇతర కేటగిరి కార్మికులకు రూ.19 వేల నుంచి రూ.31,640 వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, ఎనిమిది గంటల పని, సెలవులు కల్పించి పర్మినెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు అయిలేని మల్లికార్జునరెడ్డి, కార్మికులు దుర్గయ్య, సదానందం, వెంకటేశం, అనిల్, మహేందర్, తిరుమల, నర్సవ్వ పాల్గొన్నారు.