సిద్దిపేట రూరల్/ కొండపాక (కొమురవెల్లి), వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం నిరసనలు కొనసాగించారు. కొండపాకలోని కుకునూరుపల్లిలో, సిద్దిపేట పరిధిలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రతి షాపునకు వెళ్లి తమ వంతుగా సహకారమందించాలని కోరుతూ భిక్షాటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోందని, గ్రామాల్లో నాలుగు రోజులుగా కొత్తగా కార్మికులను పెట్టి పనులు చేయాలని అధికారులను ఆదేశించిందని తెలిపారు. ఈనెల 18న ఎమ్మెల్యేల ఇంటిముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అమ్ముల బాల్ నర్సయ్య, అధ్యక్షుడు బర్మ కొమురయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నర్సింలు, జాలిగామ ప్రభాకర్ నాయకులు కోడిపెల్లి చంద్రయ్య, జేఏసీ చైర్మన్ తునికి మహేశ్, జేఏసీ జిల్లా నాయకులు తునికి శ్రీకాంత్, నరేశ్ పాల్గొన్నారు.