
- రేపట్నుంచి జీపీ కార్మికుల నిరవధిక సమ్మె
- ఏండ్లుగా తక్కువ జీతానికే పని చేస్తూ ఇబ్బందులు
- మల్టీపర్పస్ విధానంతో పని ఒత్తిడి, వేధింపులు
- జీవో 60 ప్రకారం శాలరీలు పెంచాలని డిమాండ్
- సర్కార్ తమను పట్టించుకోవట్లేదని ఆవేదన
- ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్లు, తహసీల్దార్లకు సమ్మె నోటీసు
మహబూబ్‌నగర్/ పెద్దపల్లి వెలుగు : పనికి తగ్గ జీతంతో పాటు పర్మినెంట్ చేయాలనే డిమాండ్‌తో తొమ్మిదేండ్లుగా దశల వారీగా గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వారు రాష్ర్ట వ్యాప్తంగా ఈనెల 6(గురువారం) నుంచి సమ్మెకు రెడీ అవుతున్నారు. జూన్ 5న పంచాయతీ రాజ్ కమిషనర్‌కు కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాడో పేడో తేల్చుకుంటామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. రాష్ర్టంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 55 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
పర్మినెంట్ చేస్తామని చెప్పినా..
తెలంగాణ ఏర్పడ్డాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని ఉద్యమం టైంలో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ, జీపీ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడంతో 2017లో వారు సమ్మెకు దిగారు. 2018 ఎన్నికల తర్వాత రెండో సారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ కార్మికుల సమ్మెకు స్పందించి రూ.8,500 జీతంతో పాటు జీపీ వర్కర్లను మల్టీపర్పస్ వర్కర్లుగా గుర్తిస్తున్నట్లు జీవో 51ను జారీ చేశారు. కానీ, అప్పటి నుంచి వీరి సమస్యలు డబుల్ అయ్యాయి. గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు నడపడం, ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లు పట్టడం, మురుగు కాల్వలు క్లీన్ చేయడం తదితర పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు.
దీనికితోడు 500 జనాభాకు ఒక్కరే ఉండడంతో పని భారం పెరిగింది. కొన్ని జీపీల్లో 1,500 నుంచి రెండు వేల జనాభా ఉన్న చోట్ల ఇద్దరు, ముగ్గురు వర్కర్లు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో తమకు జీవో 60 ప్రకారం జీతాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్స్విధానాన్ని రద్దు చేసి తమను పర్మినెంట్ చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నారు. అయినా, రాష్ర్ట ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 17 డిమాండ్లతో సమ్మె నోటీసులు అందించారు.
పీఆర్సీ అమలు చేయట్లే..
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొన్ని డిపార్ట్మెంట్లలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్లకు రాష్ర్ట ప్రభుత్వం పీఆర్సీ అమలు చేస్తున్నది. కానీ, 25 ఏండ్లుగా జీపీల్లో పని చేస్తున్న కార్మికులకు పీఆర్సీ అమలు చేయడం లేదు. దీంతో వారికి పనికి తగ్గ జీతాలు రావడం లేదు. దీనికి తోడు జీవో 60 ప్రకారం కూడా శాలరీలు పెంచడం లేదు. ఈ జీవో ప్రకారం రూ.26 వేలు జీతాలు చెల్లించాల్సి ఉండగా, కనీసం రూ.19 వేలు చెల్లించాలని కోరుతున్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు తరహాలో పర్మినెంట్ చేయాలని, కొత్తగా ఏర్పాటైన జీపీలు, తండా పంచాయతీల్లో కార్మికులకు నాలుగైదు నెలలుగా జీతాలుపెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమ్మెకు పోతామంటే బెదిరింపులు..
సమ్మెకు దిగుతున్నట్లు కార్మికులు నోటీసులు ఇవ్వడంతో గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, సెక్రెటరీలు, వార్డు మెంబర్లు వేధింపులకు గురి చేస్తున్నారని వర్కర్లు ఆరోపిస్తున్నారు. సమ్మెలో పాల్గొంటే పనుల నుంచి తొలగిస్తామని, కొత్త వారిని తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు వర్కర్లు వాపోయారు. ఇప్పటికే వారి అరాచకాలు భరించలేకపోతున్నామని వాపోయారు. ఆ పని చేయాలి, ఈ పని చేయండి అంటూ తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
సమస్యలు పరిష్కరించాల్సిందే..
మున్సిపల్ కార్మికుల లెక్కనే మమ్మల్ని రాష్ర్ట ప్రభుత్వం గుర్తించాలె. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పర్మినెంట్ చేయాలె. జీవో 60 ప్రకారం జీతాలు ఇయ్యాలె. సర్పంచులు, కార్యదర్శుల వేధింపులు తగ్గించాలె. ఇప్పటి వరకు మాకు వీక్లీ ఆఫ్‌లు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రూ.399 పోస్టల్ బీమా వర్తింపజేయాలని కొద్ది రోజులుగా చెప్తున్నా పట్టించుకోవడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొంటాం.
- వెంకటేశ్ గౌడ్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
కుటుంబం గడుస్తలేదు..
నేను 15 సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న. మొదట్లో రూ. 150 జీతం ఉండే. ఇప్పుడు నా జీతం రూ.8,500. అది కూడా సక్రమంగా ఇస్తలేరు. చాలీచాలని జీతంతో కుటుంబం గడుస్తలేదు. వేరే రాష్ట్రాల్లో ఇచ్చినట్లు మాకు కూడా జీతాలు ఇయ్యాలె.
- ఎస్. రాజయ్య, జీపీ కార్మికుడు, కునారం, పెద్దపల్లి