- పథకాల అర్హుల జాబితాలపై అధికారులను నిలదీసిన జనం
- ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు?
- ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం దారుణం
- ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇండ్లు కేటాయిస్తరా?
- తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన
- ఇంకా ఎన్ని సార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నలు
వెలుగు, నెట్వర్క్:ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గ్రామ సభలు చాలా చోట్ల రసాభాసగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాల్లో అనర్హుల పేర్లు ఉండటంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు, రేషన్ కార్డులు, ఇండ్లు ఉన్నోళ్లు.. ప్రభుత్వ స్కీమ్‌లకు ఎలా అర్హులు అవుతారని నిలదీశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా జాబితాలను తయారు చేయడం సరికాదని మండిపడ్డారు.
అర్హులను కాదని.. అనర్హులకు పథకాలు కేటాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన తమకు కాకుండా ధనవంతులకు పథకాలు ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు.
ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో గ్రామాలు, వార్డుల వారీగా అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. తొలిరోజైన మంగళవారం ఆయా గ్రామాలు, వార్డుల పరిధిలో అర్హుల జాబితాను ప్రకటించారు. చాలా గ్రామాల్లో అధికారులు జాబితాలో పేర్లు చదువుతున్నప్పుడే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ అప్లై చేసుకోవచ్చని వాళ్లను సర్దిచెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినిపించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో చాలా సార్లు అప్లై చేసుకున్నామని, కాంగ్రెస్ వచ్చాక మళ్లీ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇంకా అప్లై చేసుకోవాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. జనం నిలదీయడంతో చాలా చోట్ల గ్రామసభలు అర్ధాంతరంగా ముగిశాయి.
పలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం నగరంలోని మూడో డివిజన్ బల్లేపల్లిలో సెటిలర్లకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని మండిపడ్డారు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ముదిగొండ, చింతకాని, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఎర్రుపాలెం మండలాల్లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. కూసుమంచి మండలం గట్టుసింగారంలో లబ్ధిదారుల జాబితాను గ్రామస్తులు చించేశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో అనర్హులను ఎంపిక చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆసాములు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో... తమకు గుంట భూమి లేదని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ మహిళ ఎంపీడీవో పుల్లయ్య కాళ్ల మీదపడి ఏడ్చింది. హుజూరాబాద్ మండలంలోని సింగపూర్, చెల్పూర్, కందుగుల గ్రామాల్లో స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఎలా కేటాయించారని మెదక్‌జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో అధికారులను స్థానికులు నిలదీశారు. ఆత్మీయ భరోసా స్కీమ్ జాబితాలోనూ అనర్హుల పేర్లు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలప్ చెడ్ మండలం అజ్జమర్రిలోనూ స్థానికులు ఆందోళన చేపట్టారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1, 8, 9 వార్డుల్లో నిర్వహించిన సభల్లో జనం మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. అనర్హులకే స్కీమ్‌లు కేటాయించారని ఫైర్ అయ్యారు. సర్వే సరిగ్గా చేయకపోవ డం తోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో సర్వే చేశాకే ఫైనల్ జాబితా రిలీజ్ చేయాలని డిమాండ్‌చేశారు. దీంతో 1వ వార్డులో ఆఫీసర్లు సభ నిర్వహించకుండానే వెనుదిరిగారు. కోదాడ మండలం గుడిబండలో జనం ఆందోళనకు దిగారు. భూస్వాములకు రేషన్ కార్డులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామసభలో జనం ఆందోళన చేశారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లిస్టులో తమ పేర్లు లేవని అధికారులతో
వాగ్వాదానికి దిగారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి, వడ్లగూడెం, అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు తదితర గ్రామాల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ లిస్టుల్లో అర్హుల పేర్లు లేవంటూ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లిపల్లిలో సభ నిర్వహించకుండానే ఆఫీసర్లు వెనుదిరిగారు. కొత్తగూడెం పట్టణంలో చాలా మందికి ఇండ్ల పట్టాల్లేవని, మరి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ఆఫీసర్లను సీపీఎం నేతలు నిలదీశారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అనర్హుల పేర్లు ఉండటంతో స్థానికులు ఆందోళన చేశారు. ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలని అధికారులతో బీఆర్ఎస్ లీడర్లు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఆఫీసర్లను జనం నిలదీశారు. ప్రజాపాలనలో స్వీకరించిన అప్లికేషన్లను ఆన్లైన్చేసేటప్పుడు చాలా తప్పులు జరిగాయని, అందుకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు రాలేవని ఆరోపించారు. కోహెడలో 80% అనర్హులే ఎంపికయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్, లక్ష్మీదేవిపల్లి, ఎన్సాన్ పల్లి, నంగునూరు మండలం నంగునూరు, పాలమాకుల గ్రామాల్లో రేషన్ కార్డుల జాబితాలో అనర్హులు ఎలా వచ్చారని నిలదీశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ 1వ వార్డులో అనర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును నిలదీశారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, నెలకు రూ.20 వేల పెన్షన్ వచ్చే వాళ్లు ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 12వ వార్డులో జరిగిన సభలన్నీ రసాభాసగా మారాయి. జాబితాలో తమ పేర్లు లేవంటూ భీమారం మండలం పోలంపల్లి గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో గ్రామసభ రసభసాగా ముగిసింది. అర్హుల జాబితా తప్పుల తడకగా ఉందని అడిషనల్ కలెక్టర్ డేవిడ్, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ ను స్థానికులు నిలదీశారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురి పేర్లు ఎలా సెలక్ట్ చేశారని ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో జనం పాట్లు
అధికారుల మధ్య సమన్వయ లోపం.. గ్రేటర్ హైదరాబాద్‌లో జనాలను ఇబ్బందులకు గురి చేసింది. మంగళవారం నుంచి గ్రామ సభలు పెట్టి అర్హుల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, గ్రేటర్ వాసులు.. వార్డు, బస్తీ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటారని భావించారు.
దీంతో చాలామంది అప్లికేషన్లు పెట్టుకోవడానికి సమీపంలోని తహసీల్దార్ ఆఫీసులు, బల్దియా జోన్, సర్కిల్ ఆఫీసులకు తరలివెళ్లారు. అయితే, అక్కడ ఎవరూ దరఖాస్తులు తీసుకోవడం లేదని తెలిసి నిరాశ చెందారు. ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో తహసీల్దార్, మీసేవా, కలెక్టరేట్, రేషనింగ్ ఆఫీసులకు క్యూ కట్టారు.
ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్పడంతో ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. రెవెన్యూ, బల్దియా, సివిల్ సప్లైస్ అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే గ్రేటర్హైదరాబాద్లో గందరగోళం నెలకొందని తెలుస్తున్నది.
అయితే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే 78% మాత్రమే కావడంతో వార్డు సభల్లో అర్హుల లిస్టు విడుదల చేసే అవకాశం లేక సభలు పెట్టలేదని సమాచారం. చివరికి జరిగిన పొరపాటు తెలుసుకున్న బల్దియా అధికారులు.. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల జాబితాను రిలీజ్ చేసి దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటన విడుదల చేశారు.