నెట్వర్క్, వెలుగు : అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఉండేదుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల మూడోరోజు గ్రామసభలు కొనసాగాయి. అన్నపురెడ్డిపల్లిలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కరకగూడెం మండలం భట్టుపల్లిలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలంలో ఐటీడీఏ పీవో రాహుల్, జడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, పాల్వంచలో మున్సిపల్ కమిషనర్ కొడారు సుజాత, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుతోపాటు ఆయా చోట్ల పలువురు అధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వం అమలు చేయలనుకుంటున్న నాలుగు పథకాలకు సరైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలేదని పలువురు అధికారులను నిలదీశారు. పెనుబల్లి మండలం వియం బంజర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకులు బాహాబాహికి దిగారు. ములకలపల్లిలో జాబితాలో అర్హుల పేర్లు లేవని సభను బైకాట్ చేసి ఆందోళన నిర్వహించగా, రఘునాథ పాలెం మండలం వివి పాలెంలో, పాల్వంచ పట్టణంలోని 7 వార్డుల్లో అధికారులను ప్రశ్నించారు. ఆళ్లపల్లి మండల కేంద్రం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, మంగళగూడెంలోని సభలు కూడా రసాభాసగా మారాయి.