మెదక్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు .. లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించిన అధికారులు

మెదక్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు .. లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించిన అధికారులు
  • కలెక్టర్లు రాహుల్​రాజ్, మనుచౌదరి, క్రాంతి
  • ​ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ

మెదక్​, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు.  మంగళవారం మెదక్ మున్సిపాలిటీ వార్డు సభలు, శివాయిపల్లి, హవేలీ ఘనపూర్​ మండలం ఔరంగాబాద్ తండా ప్రజాపాలన గ్రామసభలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో తొలి రోజు162 గ్రామ పంచాయతీల్లో ప్రజా పాలన గ్రామసభలు, 21 మున్సిపల్​వార్డుల్లో వార్డు సభలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు 16 నుంచి 20వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 

అనంతరం లబ్ధిదారుల ఎంపికకు 21 నుంచి 24వరకు పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో  గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో లబ్ధిదారుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపంచి తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ పథకాల్లో పేర్లు రానివారు, ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని అర్హులైన వారుంటే వారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని ఆ వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్​ఆదేశించారు. గ్రామసభల్లో మున్సిపల్ చైర్మన్​చంద్రపాల్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. నర్సాపూర్​ మండలంలోని వివిధ గ్రామాల్లో అడిషనల్​కలెక్టర్ నగేశ్, పెద్దశంకరంపేటలో ఆర్డీవో రమాదేవి గ్రామసభల్లో పాల్గొన్నారు.

 సంగారెడ్డి జిల్లాలో.. 

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో మొత్తం 849  గ్రామ సభలు జరిగాయి. 25 మండలాలు, 8 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలో సభలు కొనసాగగా కలెక్టర్ క్రాంతి కంది మండలం చెరియాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరై పరిశీలించారు. ఖేడ్ మున్సిపాలిటీలో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరు కాగా రాయికోడ్ మండలంలోని పలు గ్రామాల్లో డీపీవో సాయిబాబా పర్యటించారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ లో జరిగిన సభకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సదాశివపేట మండలంలో జరిగిన సభలకు ఆర్డీవో రవీందర్ రెడ్డి హాజరు కాగా పలు గ్రామాలు, వార్డుల్లో జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. గుమ్మడిదల మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తుండగా గ్రామస్తులకు అధికారులకు మధ్య గొడవ జరిగింది. పథకాల అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ప్రకటించారని అధికారులను నిలదీశారు. రీ సర్వే చేసి జాబితాను మళ్లీ ప్రకటించాలని డిమాండ్ చేయడంతోపాటు గ్రామసభను వాయిదా వేయాలని పట్టుబట్టారు. చేసేదేమీ లేక అధికారులు సభ వాయిదా వేసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

సిద్దిపేట జిల్లాలో..

చేర్యాల: అర్హత ఉన్నవారందరినీ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. చేర్యాల మండలంలోని వేచరేణి, కొండపాక మండలంలోని దర్గా గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీపీ సెక్రటరీలు లబ్ధిదారుల లిస్టును చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్​లో మళ్లీ దరఖాస్తులను స్వీకరించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తామని చెప్పారు.

 గ్రామ, వార్డు సభలకు రానివారు మండల కేంద్రాల్లో,  మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జీపీ సెక్రటరీలు, ప్రజలు పాల్గొన్నారు.