ఏప్రిల్ లేదా మే నెలలో ..స్థానిక ఎన్నికలు.!

ఏప్రిల్ లేదా మే నెలలో ..స్థానిక ఎన్నికలు.!
  • బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం
  • మరికొంత కాలం స్పెషల్​ఆఫీసర్ల పాలనే
  • తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌‌ పడింది. మరికొంత కాలం స్పెషల్​ఆఫీసర్ల పాలనే కొనసాగనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చే నెలలో చట్టం చేయాలని భావిస్తున్న  ప్రభుత్వం.. అప్పటిదాకా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించింది. మార్చిలో అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు ఆ తర్వాత పార్లమెంట్ లోనూ బిల్లును తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సర్కార్​భావిస్తున్నది. అదే నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. ఇక మార్చి 16 నుంచి ఏప్రిల్​2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 

దీంతో ఏప్రిల్​ మూడో వారంలో గానీ లేదంటే మే చివరి వారంలో గానీ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మేలో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున  ఏప్రిల్​లోపే ముగించవచ్చని, లేదంటే మే చివరి వారంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. మొత్తమ్మీద వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీల్లోనూ స్పెషల్​ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. దీంతో రూరల్​ లోకల్ బాడీస్​ ఎన్నికలు పూర్తవగానే.. అర్బన్ లోకల్​బాడీస్​ఎలక్షన్స్​ నిర్వహించాలని, ఈ ఎన్నికలన్నింటినీ జూన్​కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

తమిళనాడు తరహాలో అమలు..

రాష్ట్రంలోనూ తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా 50 శాతంలోపు రిజర్వేషన్లు అమలు అవుతుండగా, ఒక్క తమిళనాడులో మాత్రమే 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇందుకు నాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్పించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడదే పద్ధతిలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.  ఇందుకోసం అసెంబ్లీలో చట్టం చేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. వాస్తవానికి తమిళనాడులో 1969లో ఎన్ సత్తనాథన్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. ఇందుకు అనుగుణంగా1971లో నాటి డీఎంకే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 31 శాతానికి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. 

దాంతో మొత్తం రిజర్వేషన్లు 49 శాతమయ్యాయి. ఆ తర్వాత ఎం.జి రామచంద్రన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి చేర్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం మార్పు చేయలేదు. దీంతో రిజర్వేషన్ల శాతం 69కి పెరిగింది. కానీ మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50శాతానికి మించకూడదని 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం1993లో బీసీ కమిషన్​వేసింది. రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌‌లో చేర్పించింది. 2001లో సుప్రీంకోర్టు సంబంధిత కమ్యూనిటీలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు 50 శాతానికి మించవచ్చునని నోటిఫై చేసింది. దీంతో తమిళనాడులో బీసీలకు 30 శాతం, ఎంబీసీలకు 20 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతంచొప్పున 69 శాతం రిజర్వేషన్లు సక్సెస్​ఫుల్​గా అమలవుతున్నాయి.