
ఏపీలోని నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు చేర్చేందుకు.. గ్రామ వాలంటీర్ లను నియమించాలని ఇప్పటికే జగన్ నిర్ణయించారు. ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నియామకానికి ఏపీ ప్రభుత్వం శనివారం రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా.. ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం.. http://gramavolunteer.ap.gov.in అనే వెబ్ సైట్ ను ఏర్పాటుచేసింది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రామంలో స్థానికులై ఉండటం… కనీసం ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండటం కనీస అర్హతలు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులు.. పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఈ రిక్రూట్ మెంట్ కు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు దక్కనున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉంటారు. వీరికి నెలకు రూ.5వేలు వేతనం ఇస్తారు.
జూన్ 24 నుంచి జులై 5 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకుంటారు. జులై 10 నుంచి దరఖాస్తులు పరిశీలిస్తారు. 11 నుంచి 25వ తేదీ వరకూ సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు చేస్తుంది. గ్రామవాలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఆగస్ట్ ఒకటో తేదీన ఎంపికైన వాలంటీర్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది. మండలస్థాయిలో శిక్షణ ఇస్తుంది. పంద్రాగస్టు నుంచి గ్రామ సేవకులు వారి బాధ్యతలు తీసుకుంటారు. దాదాపు 4లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.