భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం అభిషేకం గర్భగుడిలో వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తులకు అభిషేక జలాలు పంపిణీ చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించడంతో క్రతువు ముగిసింది.
సాయంత్రం దర్బారు సేవ జరిగింది. రంగారెడ్డి జిల్లా స్నేహపూరి కొత్తపేట గ్రామానికి చెందిన మారెళ్ల వెంకట అనిల్‌కుమార్, సమితలు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో రాపత్ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీరామదూత మండపం ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామికి రాపత్ సేవ జరిగింది. ఊరేగింపుగా స్వామిని గోదావరి బ్రిడ్జి వరకు శోభాయాత్ర నిర్వహించారు. అక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో రాపత్ పూజలందుకుని తిరిగి ఆలయానికి స్వామి చేరుకున్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.