ఆసిఫాబాద్/కోల్బెల్ట్/నేరడిగొండ/కుంటాల : అయోధ్య రామ మందిరంలో బాల రాముడిని ప్రతిష్టించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్జిల్లా కేంద్రంలో శ్రీరామ హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు. జన్కాపూర్ రామాలయం నుంచి రాముడి విగ్రహంతో పెద్ద ఎత్తున ప్రజలు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇంటి వరకు చేరుకొని అక్కడి నుంచి ప్రధాన వీధుల గుండా రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆలయంలో అన్నదానం చేశారు. శ్రీరామ హిందూ పరిరక్షణ సమితి కన్వీనర్ ఇరుకుల ఆంజనేయులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ కొదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ దంపతులు వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని మధుర నగర్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుంటాల మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.