డిసెంబర్ 12న ఘనంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం

బోధన్, వెలుగు: బోధన్​ టౌన్​లోని ఏకచక్రేశ్వర శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ, కార్తీక మాసాలు ఒకే రోజు కలసిరావడం శుభ దినమని ఆలయ​అర్చకులు గణేశ్​మహారాజ్​తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్​ బీర్కూర్​ బుజ్జీ, పట్టణ ప్రముఖులు, అర్చకులు పాల్గొన్నారు.

బాన్సువాడ: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సోమవారం శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ కమిటీ అధ్యక్షుడు ముదిరెడ్డి విఠల్ రెడ్డి ఇంటి నుంచి ముత్యాల తలంబ్రాలు, నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పండితుల వేదమంత్రాల మధ్య శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో శంకర్ గురుస్వామి, కొత్తకొండ భాస్కర్ స్వామి, పిన్నూరి మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.

నవీపేట్: జన్నేపల్లి శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండగలా నిర్వహించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు స్వామి వారికి ప్రతేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. డీసీపీ కిరణ్ కుమార్, నార్త్ రూరల్ సీఐ సతీష్, ఎస్ ఐ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.